close

గురువారం, ఏప్రిల్ 02, 2020

తాజా వార్తలు

కార్మికుల భద్రతే ధ్యేయం

కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌

ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి

సంతోష్‌కుమార్‌ గంగ్వార్, ఎంపీ వంగా గీత, రాష్ట్ర మంత్రులు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కార్మికుల సంక్షేమంలో భాగంగా వారి భద్రతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ అన్నారు. కాకినాడలోని 7.26 ఎకరాల ఈఎస్‌ఐ డిస్పెన్సరీ స్థలంలో నూతనంగా రూ.110 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రికి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కాకినాడ ఎంపీ వంగా గీత అధ్యక్షత వహించి, ప్రసంగించారు. జిల్లాలో వైద్యం కోసం కార్మికులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర కార్మిక మంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. సూపర్‌స్పెషాలిటీ సేవలకు రాజమహేంద్రవరం ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెళ్లి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, కాకినాడలోనే ఈ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. తునిలో మంజూరైన ఈఎస్‌ఐ డిస్పెన్సరీని త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర కార్మిక మంత్రి సంతోషకుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో తీర ప్రాంతం అధికంగా ఉందని, కార్మికుల ఆరోగ్య సేవల కోసం 100 పడకల ఆసుపత్రిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెడికల్‌ కమిషనర్‌ ఆర్‌కే కొఠారి మాట్లాడుతూ కాకినాడలోని వంద పడకల ఆసుపత్రిని రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్ర కార్మికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉదయలక్ష్మి మాట్లాడుతూ ఈఎస్‌ఐలో నమోదైన ఆరు నెలలకే కార్మికులు సేవలు అందిస్తున్నామన్నారు.

 

స్కామ్‌లో జైలు తప్పదు

గత తెదేపా ప్రభుత్వం హయాంలో ఈఎస్‌ఐ ఆసుపత్రులకు కొనుగోలు చేసిన మందులు, వైద్య పరికరాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి జి.జయరామ్‌ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అప్పటి కార్మిక శాఖ మంత్రులు అచ్చెంనాయుడు, పితాని సత్యనారాయణ బాధ్యులని పేర్కొన్నారు. వీటిపై విచారణకు ఆదేశించామని చెప్పారు. రూ.300 కోట్ల వరకూ దోచుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల్లో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి మంత్రులు జైలుకు వెళ్లడం తప్పదన్నారు. తిరుపతి, కాకినాడలో ఈఎస్‌ఐ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని కేంద్ర కార్మిక మంత్రిని కోరారు.
* కాకినాడలో ఈఎస్‌ఐ ఆసుపత్రికి అనుబంధంగా క్యాన్సర్‌ పరిశోధన కేంద్రాన్ని, సూపర్‌ స్పెషాలిటీ సేవలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ కేంద్రమంత్రిని కోరారు. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రానున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. రాష్ట్రంలోని భాజపా నాయకులు మనకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి పినిపే విశ్వరూప్‌ కోరారు. విశాఖపట్నంలో ఈఎస్‌ఐలో ఎంబీబీఎస్‌ కళాశాలతో పాటు ఆసుపత్రి కూడా రానుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. రాజమహేంద్రవరంలోనూ వంద పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి రానుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. కాకినాడ మేయర్‌ సుంకర పావని, డిప్యూటీ మేయర్‌ కాలా సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, పలువురు కార్పొరేటర్లు, భాజపా నాయకులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.