విద్యార్థులే లక్ష్యం
eenadu telugu news
Published : 27/07/2021 06:01 IST

విద్యార్థులే లక్ష్యం


కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ రమేష్‌బాబు

తుని, న్యూస్‌టుడే: తుని పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయ ముఠాలు రెచ్చిపోతున్నాయి. మద్యం, మత్తుకు బానిసలైన వారిని వలలో వేసుకుని వారి ద్వారా మరికొందరిని ఈ ఉచ్చులోకి లాగుతున్నట్లు పోలీసులు పసిగట్టారు. పట్టణ సీఐ జి.రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాసా థియేటర్‌ సెంటర్‌లో సోమవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖజిల్లా పాయకరావుపేట మండలం రాజవరం గ్రామానికి చెందిన కె.శ్రీను, తుని మండలం అటికివానిపాలెంకు చెందిన జి.మురళి ద్విచక్రవాహనంపై ప్లాస్టిక్‌ బ్యాగుల్లో 4 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. వీరు విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి కిలోల్లో తెచ్చి మరి కొందరితో కలిసి చిన్నచిన్న పొట్లాలుగా చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారని తేల్చారు. వీరి ద్వారా రాజవరానికి చెందిన కె.శివ, వై.గోవిందును కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకున్నామన్నారు. కొంత కాలంగా ఈ దందా జరుగుతున్నట్లు గుర్తించామని సీఐ స్పష్టం చేశారు. పలు కళాశాలల విద్యార్థులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ కేసులో నిందితులు కూడా చదువుకున్న వారేనని, చెడు అలవాట్లకు బానిసలై వీరు సులువుగా డబ్బు సంపాదించి జల్సాలు చేయడానికి ఈ మార్గం ఎంచుకుని చివరకు కటకటాలపాలయ్యారన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్సై స్వామినాయుడు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు అభినందించారు.

గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని