ముప్పేట ముంపు
eenadu telugu news
Published : 27/07/2021 06:09 IST

ముప్పేట ముంపు

వరద తగ్గినా వీడని కష్టాలు

తొలి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

అయినవిల్లి వద్ద ఎదురుబిడుం కాజ్‌వేపై నీటిలోనే రాకపోకలు

ఈనాడు - కాకినాడ, ఈనాడు డిజిటల్‌ - రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే - దేవీపట్నం, పి.గన్నవరం : గత రెండు రోజులుగా ఉగ్రరూపం  దాల్చిన గోదావరి శాంతించింది. ధవళేశ్వరంలో కాటన్‌ బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రం జారీచేసిన మొదటి ప్రమాద హెచ్చరికను వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో సోమవారం వేకువ జామున ఉపసంహరించారు. సోమవారం రాత్రి 8 గంటల  సమయానికి బ్యారేజీ వద్ద 9.90 అడుగుల నీటిమట్టం ఉంటే.. సముద్రంలోకి 7.71 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  పరిస్థితి కుదుటపడడంతో కొంత ఉపశమనం దక్కింది.

తూర్పు మన్యంలో..

శిఖరం మాత్రమే కనిపిస్తున్న పోశమ్మగండి ఆలయం 

పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పైభాగంలో రెండు రోజులుగా ముంచెత్తిన వరద సోమవారం తగ్గింది. 36 గ్రామాల్లోనూ ముంపు కొనసాగుతోంది. రహదారులు జలదిగ్బంధంలో ఉన్నాయి. చినరమణయ్యపేటలో వరద పెరగడంతో ఊరు ఖాళీచేశారు. మైదాన ప్రాంతంనుంచి గండిపోశమ్మ ఆలయానికి వచ్చే భక్తులను దేవాదాయ శాఖ అధికారులు కొండ దగ్గరే నిలిపివేస్తున్నారు. పోశమ్మ గండినుంచి ముంపు గ్రామాలకు వెళ్లే విద్యుత్తు లైన్లు వరద నీటిలోనే ఉన్నాయి. నీ మన్యంలో 412 కుటుంబా ల్లోని 1,096 మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. వీఆర్‌ పురంలోని రెండు శిబిరాల్లో 230 కుటుంబాలు,  కూనవరంలో రెండు శిబిరాల్లో 182 కుటుంబాలు ఉన్నట్లు వివరించారు. 

కొండపై తలదాచుకున్న తాళ్లూరు గిరిజనులు


కోనసీమ లంకల్లో..

కోనసీమలో పలు లంక గ్రామాల్లో కోతతోపాటు పంటలు మునిగాయి. పి.గన్నవరం పరిధిలో నాలుగు లంక గ్రామాలకు పడవ ప్రయాణం దిక్కయింది. చాకలిపాలెం సమీపంలో కాజ్‌వే నీట మునిగి ప.గో జిల్లా కనకాయలంక ప్రజలు నావలపై వస్తున్నారు.  అయినవిల్లి మండలంలోని 
ఎదురుబిడుం దగ్గర కాజ్‌వేపై మోకాలి లోతుకు వచ్చిన నీరు తగ్గుతోంది. ్ర అల్లవరం మండలం బోడసకుర్రు, గోపాలయిలంకలో ఇళ్లచుట్టూ నీరు చేరింది. ముమ్మిడివరం పరిధిలోని కమిని, సలాదివారిపాలెం, లంక ఆఫ్‌ ఠాణేలంక, గేదెల్లంక, గురజాపు లంకలో ఉద్యానపంటలు మునిగాయి.

బోడసకుర్రు పల్లిపాలెం జలమయం

భయంతో పరుగులు

రాత్రికి రాత్రి వరద  పెరిగింది. తేరుకునేలోపే ఇళ్లు, వాకిళ్లు మునిగాయి. సామగ్రి వదిలేసి ప్రాణభయంతో ఎగువకు పరిగెత్తాం. ఆదుకుంటుదనుకున్న ప్రభుత్వం నట్టేటముంచింది.   - కె.వీరమణి, పి.గొందూరు

ప్రాణం పోయినా కదలం

మాకు పూర్తి పరిహారం ఇవ్వలేదు. అధికారులు సర్దిచెప్పడానికే వస్తున్నారు. మేము సర్వం కోల్పోయాం. పరిహారం ఇచ్చేదాకా ప్రాణం పోయినా కదలం.  - శ్రీనివాసదొర, సర్పంచి  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని