పారాదీప్‌లో పడవ బోల్తా
eenadu telugu news
Published : 20/09/2021 06:51 IST

పారాదీప్‌లో పడవ బోల్తా

ఇద్దరు మత్స్యకారుల గల్లంతు

కటక్‌, న్యూస్‌టుడే: పారాదీప్‌ సముద్రంలో వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై పారాదీప్‌ మత్స్యకారుల సంఘం ప్రతినిధి కె.సుబ్బారావు అందించిన వివరాలు ప్రకారం.. సందకుద మత్స్యకార గ్రామానికి చెందిన అర్జీలు గోవిందా అనే మత్స్యకారుడు మరో నలుగురితో కలిసి శుక్రవారం సముద్రంలోకి వేటకు వెళ్లారు. ఆదివారం ఉదయం తిరిగివస్తుండగా లంగరేసే ప్రాంతానికి అరకిలోమీటరు దూరంలో పడవ బోల్తా పడింది. దీంతో ఐదుగురు సముద్రంలో పడిపోయారు. కొద్ది దూరంలో వేరే పడవలో ఉన్న మత్స్యకారులు గమనించి ముగ్గురిని రక్షించగా, మిగిలిన ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో తుని నియోజకవర్గంలోని ఎర్రయ్యపేట గ్రామానికి చెందిన చొక్కా దేవుడు(30), గంజాం జిల్లా గోపాల్‌పూర్‌కి చెందిన కామరాజు(30)ఉన్నారు. కాపాడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు.

పడవ మునక.. మత్స్యకారులు సురక్షితం

ఐ.పోలవరం: ఐ.పోలవరం మండలం జి.మూలపొలం రేవు సమీపంలో వేటకు బయలుదేరిన పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. అందులో వేట సాగించే అయిదుగురు మత్స్యకారులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. మునిగిన పడవ నుంచి మత్స్యకారులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తోటి మత్స్యకారులు ఇతర పడవల సాయంతో మునిగిన పడవను ఒడ్డుకు చేర్చారు. రేవు సమీపంలో వడి అధికంగా ఉండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదే ప్రాంతంలో రేవు దాటింపు జరుగుతుడటంతో ప్రయాణికులు హడలిపోతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని