‘అవిశ్వాసం’పై వ్యూహ, ప్రతివ్యూహాలు
eenadu telugu news
Published : 21/09/2021 03:02 IST

‘అవిశ్వాసం’పై వ్యూహ, ప్రతివ్యూహాలు

 

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: కాకినాడ నగరపాలక సంస్థలో తమ పట్టును నిలుపుకొనేందుకు వైకాపా, తెదేపా వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇక్కడ తెదేపాకు చెందిన మేయర్‌ సుంకర పావని, డిప్యూటీ మేయర్‌ కాలా సత్తిబాబును పదవుల్లో నుంచి దించేందుకు 33 మంది కార్పొరేటర్ల సంతకాలతో అవిశ్వాస నోటీసును కలెక్టరుకు అందజేసిన విషయం తెల్సిందే. అక్టోబరు 5న ప్రత్యేక సమావేశం నిర్వహించి అవిశ్వాసంపై ఓటింగ్‌ నిర్వహించేందుకు కార్పొరేటర్లందరికీ నోటీసులు జారీ అయ్యాయి. వైకాపా, తెదేపా అసమ్మతి కార్పొరేటర్లు ప్రయోగించిన అవిశ్వాస ఎత్తుగడను తిప్పికొట్టేందుకు మేయర్‌ విప్‌ అస్త్రాన్ని వినియోగించేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆమె పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వ్యవహారాన్ని తీసుకెళ్లినట్లు తెలిసింది. విప్‌ జారీకి ఆయన అంగీకరించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సూచనలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మేయర్‌, డిప్యూటీ మేయర్లపై వైకాపా తలపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో పార్టీకి కట్టుబడాలని మాజీ ఎమ్మెల్యే కొండబాబుకు సైతం అధిష్ఠానం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.

కోర్టుకు వెళ్లకుండా..

పదవులను కాపాడుకునే విషయంలో మేయర్‌, డిప్యూటీ మేయర్లు న్యాయపరంగా ముందుకెళ్లకుండా వైకాపా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. పదవుల్లో కొనసాగేందుకు న్యాయపరమైన అవకాశాలను మేయర్‌ వర్గం ఉపయోగించుకోకుండా కెవియట్‌ను ప్రయోగించినట్లు తెల్సింది. ఎన్నికల విషయంలో కోర్టుకు వెళ్లకుండా తెదేపా సభ్యులకు ముందుగానే కెవియట్‌ జారీ చేసినట్లు సమాచారం. ఈ ఉత్తర్వులు తమకు అందినట్లు తెదేపా సభ్యురాలు తుమ్మల సునీత సోమవారం ధ్రువీకరించారు. ఇటీవల అవిశ్వాస తీర్మాన నోటీసును మేయర్‌ తీసుకోలేదు. ఆ రోజు ఆమె ఇంటివద్ద అందుబాటులో లేకపోవటంతో స్థానికులతో రెవెన్యూ మున్సిపల్‌ అధికారులు పంచనామా నిర్వహించి గోడకు అతికించారు. మేయర్‌ ఇంటివద్దే ఉండి నోటీసును తీసుకోలేదని వైకాపా ఆరోపిస్తోంది. ఆమె ఇంటి ఎదురుగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంతో ఆ రోజు ఆమె ఇంటివద్దే ఉన్నట్లు నిరూపణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని