మండలాధీశుల ఎన్నిక నేడు
eenadu telugu news
Published : 24/09/2021 06:28 IST

మండలాధీశుల ఎన్నిక నేడు

కొలువుదీరనున్న పాలకవర్గాలు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో 60 మండల పరిషత్తుల్లో పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఎంపీటీసీలుగా ఎన్నికైన అభ్యర్థులు మండల పరిషత్తు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇందుకు శుక్రవారం ముహూర్తం నిర్ణయించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల ప్రకారం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల నిర్వహణకు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అన్ని మండల పరిషత్తులకు ప్రిసైడింగ్‌ అధికారులను (గెజిటెడ్‌ అధికారులు) నియమించారు.

 

ప్రత్యేకసమావేశం

తొలుత కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు ఉదయం 10 గంటలలోపు నామపత్రాలు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలలోపు పరిశీలించి.. ఒంటి గంటకు జాబితా ప్రచురిస్తారు. తర్వాత ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. ఆపై వీరంతా పరోక్ష పద్ధతిలో కో- ఆప్షన్‌ సభ్యుడిని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ ముగిశాక మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంపీపీ, వైస్‌ ఎంపీపీని ఎన్నుకుంటారు. సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మీడియాను మాత్రమే అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

వైకాపా అభ్యర్థుల ఎంపిక పూర్తి

జిల్లాలో 60 మండల పరిషత్తుల పరిధిలో మెజారిటీ స్థానాల్లో వైకాపా విజయం సాధించడంతో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపిక లాంఛనమేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వైకాపా ఎమ్మెల్యేలు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైస్‌ ఎంపీపీ అభ్యర్థుల ఖరారుతో సామాజిక సమతూకం చూసుకుని ఎంపిక చేయాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. మండల పరిషత్తు పీఠాలకు కేటాయించిన రిజర్వేషన్లకు అనుగుణంగా ఇతర పదవుల పంపకం విషయంలో సామాజిక సమతూకం పాటించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇలా చెబుతున్నప్పటికీ కొన్ని మండలాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో ఇంకా చిక్కుముడి వీడలేదు.

ఆ నాలుగుచోట్ల ఉత్కంఠ 

నాలుగు మండల పరిషత్తుల్లో వైకాపాకు పూర్తి ఆధిక్యం లేకపోవడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. పి.గన్నవరం, మలికిపురం, ఆలమూరు, కూనవరంలో వైకాపాకు ఆధిక్యం రాలేదు. కూనవరంలో లాటరీ విధానంలో ఎంపిక చేస్తారా? ఇంకేమైనా చోటుచేసుకుంటుందా అనేది ఉత్కంఠగా మారింది. ఆలమూరు మండలంలో వైకాపా 10, తెదేపా, జనసేన కలిసి 10 సీట్లు గెలుచుకున్నాయి. ఇక్కడ పరిస్థితి జఠిలంగా ఉంది. మలికిపురం, కడియం మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని