చౌక చక్యంగా..బొక్కేస్తున్నారు !
eenadu telugu news
Published : 24/09/2021 06:28 IST

చౌక చక్యంగా..బొక్కేస్తున్నారు !

పేదల బియ్యం.. ఓడరేవు నుంచి విదేశాలకు..

 రాజకీయ దన్నుతో దర్జాగా దందా

రావులపాలెం: స్వాధీనం చేసుకున్న బియ్యం

ఆలమూరు మండలంలోని జొన్నాడ వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 17వేల కిలోల చౌక బియ్యాన్ని నిఘా- అమలు విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా కంచికర్ల నుంచి కాకినాడ వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు.

రావులపాలెం మండలం ఈతకోట వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న పేదల బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వ్యానులో అడ్డదారిన వెళ్తున్న 4,500 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కాకినాడ గ్రామీణం తూరంగిలో ఓ ప్రైవేటు గోదాములో 10 లారీల చౌక బియ్యాన్ని గతంలో అధికారులు గుర్తించారు. ముందస్తు సమాచారంతో 20 మంది పౌరసరఫరా అధికారులు బృందంగా వెళ్లి ఈ భారీ నిల్వలు పట్టుకున్నారు.

ఈనాడు - కాకినాడ : రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. రూపాయి బియ్యం రూపు మారుస్తూ దేశం దాటిస్తోంది. ఓ వైపు ప్రభుత్వం పేద కుటుంబాల సంక్షేమాన్ని కాంక్షించి భారీ రాయితీ భారాన్ని భరిస్తూ అందిస్తుంటే.. అక్రమార్కులు పెద్దఎత్తున నిల్వలు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ మాఫియాకు నాయకులు, కొందరు అధికారుల దన్ను ఉండటంతో అక్రమాలకు అడ్డేలేకుండా పోతోంది. జిల్లా నుంచే కాక.. వివిధ జిల్లాల నుంచి సేకరిస్తున్న బియ్యాన్ని రీ సైక్లింగ్‌చేసి.. పాలిష్‌ అద్ది సముద్ర మార్గంలో హద్దులు దాటిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై నిఘా అంతంతే ఉండటంతో ఆడిందే ఆటలా వ్యవహారం సాగిపోతోంది.

డీల్‌ కుదిరిందా..?

జిల్లాలో పోర్టు నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు పేదల బియ్యం కొందరు నాయకుల దన్నుతోనే తరలిపోతుందనేది సుస్పష్టం. ప్రైవేటు సైన్యంతోపాటు.. అక్రమ వ్యాపారం చేస్తున్న కొందరు ఎగుమతిదారులను మచ్చిక చేసుకుని వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఎగుమతిలో దిట్టగా పేరున్న ఓ వ్యక్తితో.. జిల్లాకు చెందిన ఓ నాయకుడు విదేశీయులతో బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై భారీ డీల్‌ కుదుర్చుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు అధికారిక కసరత్తు మొత్తం పూర్తిచేసినట్లు సమాచారం.

టన్నులకొద్దీ విదేశాలకు..

●●●కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు పేదల బియ్యం తరలిపోతున్నాయనే ఆరోపణలు దశాబ్దాలుగా వస్తున్నాయి. అడపాదడపా తనిఖీల్లో అక్రమాలూ వెలుగుచూస్తున్నాయి. ●●● అప్పుడప్పుడు పోర్టుకు వెళ్తున్న బియ్యం పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నా.. పాలిష్‌ చేసిన బియ్యాన్ని పీడీఎస్‌ అని నిరూపించ లేకపోవడంతో కేసులు తేలిపోతున్నాయి. ●●●● గతంతో పోలిస్తే కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయి. ఆఫ్రికా, బంగ్లాదేశ్‌, తూర్పు ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. లక్షల టన్నుల బియ్యం ఎగుమతుల్లో భాగంగా రూపాయి బియ్యం కూడా విదేశాలకు తరలిపోతోంది. ●●● పోర్టుల వద్ద శాశ్వత చెక్‌పోస్టులు ఏర్పాటుచేయాలని.. పోర్టుకు వచ్చే ప్రతి వాహనం తనిఖీ చేయాలనే ప్రతిపాదన రాజకీయ జోక్యంతో బుట్టదాఖలయ్యింది.

జిల్లాలో 2,564 చౌక దుకాణాలకు రేషన్‌ బియ్యం అందేది. నిన్న మొన్నటి వరకు కొంత నిల్వ కేంద్రాల నుంచి.. మరికొంత చౌక దుకాణాల నుంచి పక్కదారి పట్టేది. ఇప్పుడు వాహనాల ద్వారా ఇంటింటికీ అందిస్తున్నా.. నిల్వ కేంద్రాల నుంచి,చాలామంది లబ్ధిదారుల నుంచి దళారులకు చేరుతోంది. జిల్లాలో 16.58 లక్షల కార్డులుంటే.. నెలకు 22 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు డబుల్‌ కోటా ఇవ్వడంతో..అక్రమార్కుల పంట పండినట్లయింది.

రూపాయి బియ్యం.. రూపు మార్ఛి..

రాయితీ బియ్యం కోసం ద్విచక్ర వాహనాలపై ఊరూరా తిరిగే ముఠాలు కిలో రూ.10-15కు చెల్లించి మరీ కొంటున్నారు. ఆపై సన్న బియ్యంగా మార్చి అధిక ధరలకు అమ్మేస్తున్నారు. కొందరు మిల్లర్లు రేషన్‌ బియ్యాన్ని సేకరించి.. సార్టెక్స్‌ యంత్రాలతో రీసైక్లింగ్‌ చేసి.. నిర్దేశిత సంచుల్లోకి నింపి ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా సిద్ధం చేస్తున్నారు. అసలు బియ్యానికి, పేదల బియ్యానికి తేడా గుర్తించలేని విధంగా పాలిష్‌, ప్యాకింగ్‌ చేస్తున్నారు.

నిఘా పెంచి దందా కట్టడి

పేదలకు అందాల్సిన రాయితీ బియ్యం అడ్డదారిలో అమ్మడం, కొనడం నేరమే. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇద్దరు ఎస్పీలు, విజిలెన్స్‌ విభాగంతో బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై చర్చించి అప్రమత్తం చేశాం. కట్టడికి శాఖాపరమైన సహకారం అందిస్తాం. పోర్ట్‌ ద్వారా పేదల బియ్యం తరలిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెక్‌ పోస్టు ఏర్పాటు చేసి నిఘా పెంచుతాం. -డాక్టర్‌ లక్ష్మీశ, జేసీ

ఆలమూరు: కాకినాడ తరలిస్తున్న చౌకబియ్యం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని