ప్రసాద్‌ పథకంతో దేవస్థానం మరింత అభివృద్ధి
eenadu telugu news
Published : 24/09/2021 06:28 IST

ప్రసాద్‌ పథకంతో దేవస్థానం మరింత అభివృద్ధి


సమావేశంలో ఛైర్మన్‌ రోహిత్‌, ప్రత్యేక ఆహ్వానితుడు పూర్ణచంద్రప్రసాద్‌, ఈవో త్రినాథరావు

అన్నవరం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్‌’ ద్వారా అన్నవరం దేవస్థానం మరింత అభివృద్ధి చెందుతుందని ఛైర్మన్‌ ఐ.వి.రోహిత్‌, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుడు, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, ఈవో వి.త్రినాథరావు పేర్కొన్నారు. ఛైర్మన్‌ రోహిత్‌ అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం గురువారం జరిగింది. ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించిన పూర్ణచంద్రప్రసాద్‌కు ఛైర్మన్‌, ఈవో, సభ్యులు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ప్రసాద్‌ ద్వారా సుమారు రూ.50 కోట్లు విడుదల అయ్యే అవకాశముందని, ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపుతున్నామని సభ్యులకు వివరించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఆలయంలో నిత్యం అగ్నిహోత్రం కార్యక్రమ నిర్వహణకు పురోహితుడి నియామకం, కారుణ్య నియామకం, ప్రసాదం తయారీ విభాగంలో అదనంగా అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఇద్దరు వంట స్వాముల నియామకం, ఆలయ భూముల కౌలు, కొండ పైన, దిగువున పలు వ్యాపార హక్కులు టెండర్లపై చర్చించి ఆమోదించారు.

 

పంచదార కొనుగోలుకు మరోసారి టెండర్లు..

ప్రసాదం తయారీ, మహానివేదన, అన్నదానానికి అవసరమైన పంచదార, గోధుమ నెయ్యి, బియ్యం తదితర సరకుల కొనుగోలు, కూరగాయలు టెండర్లపై చర్చించి పంచదారకు మినహా మిగిలిన వాటికి ఆమోదం తెలిపారు. పంచదారకు మరోసారి టెండర్లు పిలవాలని నిర్ణయించారు.

రూ. 2.65 లక్షలతో గోశాల అభివృద్ధి పనులకు ఆమోదించారు. విద్యుత్తు సామగ్రి కొనుగోలుకు కమిటీని నియమించి పరిశీలించాలని నిర్ణయించారు.

వ్రత టికెట్ల ధర పెంపు వాయిదా..

రూ.300 వ్రత టికెట్లు రుసుం రూ.500కు పెంచాలన్న నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ ప్రతిపాదనపై సభ్యులు చర్చించారు. రానున్న రోజుల్లో నూతన వ్రత మండపాల నిర్మాణం, భక్తులకు మరింత సౌకర్యాలు మెరుగుపడిన తర్వాత పరిశీలిద్దామని అభిప్రాయం వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని