రైలు ఢీకొని ప్రభుత్వ ఉద్యోగిని దుర్మరణం
eenadu telugu news
Published : 27/09/2021 04:14 IST

రైలు ఢీకొని ప్రభుత్వ ఉద్యోగిని దుర్మరణం


చింతల సీత (పాతచిత్రం)

 

కొత్తవలస, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లాలో కొత్తవలస కూడలి వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో చింతల సీత(56) అనే మహిళ ఆదివారం దుర్మరణం చెందారు. ఈమె భోగాపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబార్డినేట్‌గా పనిచేస్తున్నారు. గతంలో కొంత కాలం కొత్తవలస సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయంలో పనిచేశారు. ఇక్కడ పాతరైల్వే స్టేషన్‌ వద్ద సాయినగర్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడి నుంచి భోగాపురానికి బదిలీ అయ్యాక అక్కడ అద్దె ఇంటిలో ఉంటూ సెలవులకు వస్తుంటారని స్థానికులు తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో ఇక్కడ పట్టాలు దాటుకుని వస్తుండగా విజయనగరం వైపు వెళుతున్న కన్యాకుమారి-హౌరా సూపరుఫాస్ట్‌ రైలు ఢీకొంది. ఈ ధాటికి ఆమె కొంతదూరం తుళ్లిపడగా శరీరం తునాతునకలైంది. ఈ ప్రమాదంతో రైలును కొంతసేపు నిలిపివేశారు. ఈమె చేతిబ్యాగులో ఉన్న గుర్తింపు కార్డు, చరవాణి ఆధారంగా మృతురాలిని రైల్వే పోలీసులు గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. సీత స్వస్థలం రాజమహేంద్రవరం ప్రాంతమని స్థానికులు చెబుతున్నారు. వివాహమైనా చాలాఏళ్ల క్రితం భర్త చనిపోయారు. పిల్లలు లేరు. ఒంటరిగానే జీవిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు జీఆర్‌పీ శ్రీనివాసరావు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని