ఇదేంటి స్వామి..
eenadu telugu news
Updated : 27/09/2021 06:26 IST

ఇదేంటి స్వామి..

వ్రత మండపాలు, వసతి గదుల నిర్వహణ అధ్వానం

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో భక్తుల సౌకర్యాల కల్పనపై అధికారులు శ్రద్ధ చూపడం లేదు. వ్రత మండపాలు, వసతి గదులు అధ్వానంగా ఉన్నాయి. కొన్ని మండపాలు, గదుల పైకప్పు పెచ్చులూడి, విద్యుత్తు తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. ప్రముఖ దేవస్థానాల్లో అభివృద్ధి పనులపై సోమవారంసీఎం సమీక్షిస్తున్న నేపథ్యంలో కథనం. - న్యూస్‌టుడే, అన్నవరం

ఎవరికి ఫిర్యాదు చేయాలి

ఫిర్యాదుల పుస్తకం లేకుండా ఖాళీగా ఉన్న బల్ల

భక్తులకు ఎదురవుతున్న సమస్యలు, సేవా లోపాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకునేవారే లేరు. భక్తుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు 2017లో ఆలయంలో అన్ని విభాగాల వద్ద ఫిర్యాదుల పుస్తకాలు ఏర్పాటు చేసి పెద్ద బోర్డులు పెట్టారు. దీంతో అనేక మంది సమస్యలను తెలియజేసేవారు. వీటిని అప్పటి ఈవో పరిశీలించి తగు చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం బోర్డులు ఉన్నాయి తప్ప పుస్తకాలను తీసేశారు. నేరుగా ఈవో కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేద్దామన్నా స్పందించేవారే లేరని పలువురు భక్తులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

ఇదీ పరిస్థితి..


చేతికందే ఎత్తులో విద్యుత్తు బోర్డులు ఊడి తీ గలు వేలాడుతూ.... 

సత్యదేవుని సన్నిధిలో వేలాది వ్రతాలు జరుగుతుంటాయి. వ్రత మండపాల నిర్వహణపై మాత్రం అధికారులు కనీస శ్రద్ధ చూపడం లేదు. ముఖ్యంగా రూ.800 టికెట్టు మండపాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ మండపాలు 5 ఉన్నాయి. కొన్నింటి పైకప్పు పెచ్చులూడుతోంది. కొన్నింట వర్షపునీరు కారుతుందని సిబ్బంది చెబుతున్నారు. విద్యుత్తు బోర్డులు ఊడిపోయి తీగలు బయటకు వేలాడుతున్నాయి. పాత సామగ్రిని మండపాల్లోనే మూలన పడేయడంతో అపరిశుభ్ర వాతావరణం ఉంది. వ్రత వివరాలను తెలియజేసే బోర్డులు చెరిగిపోయి అర్థంకాని పరిస్థితి. నవంబరు మొదటి వారం నుంచి కార్తికమాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో సుమారు లక్ష వ్రతాలు జరిగే అవకాశముంది. అయినా మండపాలపై దృష్టి సారించడం లేదు.

వసతి సముదాయాల్లో ఇలా..

పడిపోయిన పాత సెంటినరీ కాటేజీ సెల్లార్‌ స్లాబ్్క

దేవస్థానంలో కొన్ని వసతి సముదాయాల్లోని గదుల పరిస్థితి అధ్వానంగా ఉంది. నిర్వహణపై కనీస శ్రద్ధ చూపడం లేదు. పాత సెంటినరీ కాటేజీలో ఇటీవల సెల్లార్‌ స్లాబ్‌ పడిపోయింది. గదుల్లో పైకప్పు శిథిలస్థితికి చేరి ఉండడంపై భక్తులు భయాందోళన చెందుతున్నారు. వర్షపు నీరు గదుల్లోకి చేరి గోడలు బీటలు వారి దుర్వాసన వస్తోంది. సీతారామసత్రం, సత్యదేవా అతిథి గృహం తదితర చోట్ల ఇదే పరిస్థితి. వసతి సముదాయాల్లో మరమ్మతులు చేపట్టాలని, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయా సముదాయాల ఉద్యోగులు నివేదిక ఇచ్చినా పట్టించుకోని పరిస్థితి.

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని