పొదుపు తోనే .. ప్రగతి వెలుగు 
eenadu telugu news
Updated : 15/10/2021 06:07 IST

పొదుపు తోనే .. ప్రగతి వెలుగు 

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, దేవీచౌక్‌ (రాజమహేంద్రవరం) : విద్యుత్తు ఉత్పత్తికి.. వినియోగానికి తేడా భారీగా పెరుగుతోంది. బొగ్గు సంక్షోభంతో సమస్య జటిలమైంది. అనధికార  కోతలు అనివార్యమయ్యేలా ఉన్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల కోతలు మొదలయ్యాయి. జిల్లాలో పరిశ్రమ, సాగు, వాణిజ్య అవసరాలకుతోడు గృహ వినియోగం అధికంగానే ఉంది. పరిశ్రమలకు ఆంక్షలు విధించిన తరుణంలో పరిస్థితి కుదుటపడే వరకు అన్ని వర్గాల వినియోగదారులూ విద్యుత్తు పొదుపుగా వాడాల్సిందే.

1 జిల్లా పెద్దది.. జనాభా ఎక్కువ కావడంతో విద్యుత్తు అవసరాలు పెరుగుతున్నాయి. ఇటీవల రోజుకు వ΄డు మిలియన్‌  యూనిట్ల విద్యుత్తు వాడకం పెరిగింది.

2 సాధారణంగా సాయంత్రం 6 - రాత్రి 10 గంటల వరకు విద్యుత్తు వినియోగం ఎక్కువ. ఇప్పుడు అర్ధరాత్రి వరకు తాకిడి పెరిగింది. పరిశ్రమల్లో ఉత్పత్తికి ఆటంకం లేకుండా చూస్తూనే... ఆక్వా సాగుకు సరఫరాలో పీక్‌లోడ్‌ ఉన్నప్పుడు ఆంక్షలు విధిస్తున్నారు.

3 పండగ వేళ విద్యుత్తు ఉపకరణాల కొనుగోలుకు ఆసక్తి చూపే ప్రజలు స్టార్‌ రేటింగ్‌ మేరకు తక్కువ విద్యుత్తుతో నాణ్యమైన సేవలు అందించేవి కొనడం ఉత్తమం. వీటి వినియోగంతో 20-40 శాతం వరకు ఆదా చేయవచ్చు.

ఇంటి నుంచే చక్కదిద్దుదాం..

అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫ్యాన్లు, లైట్లు వేయాలి. సీఎఫ్‌ఎల్, ఎల్‌ఈడీ బల్బుల వాడకంతో ఆదా చేయవచ్చు. ఫ్యాన్లు, ఇతర విద్యుత్తు పరికరాల నిర్వహణ ద్వారా విద్యుత్తు వినియోగం తగ్గించుకోవచ్చు.

తక్కువ విద్యుత్తు.. నాణ్యతతో పని చేసే స్టార్‌ రేటింగ్‌ ఉన్న రిఫ్రిజిరేటర్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫ్రిజ్‌ థర్మోస్టాట్‌ను మధ్యస్థంగా ఉంచాలి. ఫ్రిజ్‌ చల్లదనం ఇవ్వకపోయినా, కంప్రెషర్‌లో ఆగిపోవడం గుర్తిస్తే సరిచేయించాలి.

ఒక ఏసీ 30 ఫ్యాన్లతో సమానం. శీతల యంత్రాన్ని 24 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో వాడితే విద్యుత్తు పొదుపు చేయవచ్చు. ఇలా నియంత్రిస్తే ప్రతి సెంటీగ్రేడ్‌కు 5 శాతం విద్యుత్తు ఆదా చేసుకోవచ్చు. ఏసీ ఫిల్టర్‌ ప్రతినెలా శుభ్రం చేయడం, చల్లదనం గది బయటకు పోకుండా జాగ్రత్తలు తీసుకోవడం.. గది చల్లబడ్డాక ఏసీ ఆపితే భారం తగ్గేవీలుంది. 

టీవీలు, కంప్యూటర్లు అవసరం లేనప్పుడు స్విచ్‌ ఆపాలి. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి వదిలేయడం.. ఛార్జింగ్‌ పూర్తయ్యాక ఫోన్‌ తీసేసినా.. ఛార్జర్‌ స్విచ్‌ ఆపకపోవడం సరికాదు.

పరిశ్రమల్లో..

ప్రతి పరిశ్రమలో ఎనర్జీ ఆడిట్‌ తప్పనిసరి. పరిశ్రమకు అవసరమైన విద్యుత్తు సామర్థ్యం ఎంత? వాడుతున్నది ఎంత? విద్యుత్తు వృథా ఎంతనే దానిపై స్పష్టత ఉంటే.. తగ్గించుకుని నష్టాలు అధిగమించే వీలుంది.
పవర్‌ ఫ్యాక్టర్‌ ఒకటి ఉండేలా చూడాలి. ఒత్తిడికి అనువైన సామర్థ్యంతో తీగల అమరిక ఉండేలా చూసుకోవాలి. ్ల్వ) పరిశ్రమల్లో వాడే మోటార్ల సామర్థ్యానికి అనువైన కెపాసిటర్ల ఏర్పాటు తప్పనిసరి. మోటార్ల సమర్థ నిర్వహణతో అధికలోడు తీసుకునే పరిస్థితి నుంచి బయటపడొచ్చు. 

పరిశ్రమల అంతర్గత ఉపకేంద్రాలతోపాటు.. వైరింగ్‌ వ్యవస్థ సమర్థంగా ఉంటే కాంటాక్ట్‌ లూజ్‌ ద్వారా విద్యుత్తు నష్టాలు అధిగమించవచ్చు.

హలధారీ.. తెలుసుకో!

వ్యవసాయ అవసరాలకు ఐఎస్‌ఐ గుర్తింపు ఉన్న విద్యుత్తు మోటార్లు వాడాలి. పంపు సెట్‌కు సరిపడా కెపాసిటర్‌ వాడాలి. ఫుట్‌ వాల్వ్‌తోపాటు.. పైపులైన్లలో లీకేజీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మోటారు ఆన్‌ చేసి వదిలేయకుండా.. అవసరం మేరకే వాడాలి. సౌర విద్యుత్తు వాడితే ప్రతినెలా విద్యుత్తు బిల్లు మోత తప్పుతుంది. విద్యుత్తు ఉత్పత్తిలో అవాంతరాల నేపథ్యంలో రోజుకు 40 మెగావాట్ల విద్యుత్తు వినియోగిస్తున్న ఏడు వేల ఆక్వా కనెక్షన్లపై నిర్దేశిత సమయాల్లో ఆంక్షలు విధించారు. 

వాణిజ్య ప్రాంగణాల్లో..

వాణిజ్య సముదాయాల్లో పగటి పూట నిరంతర వ్యాపారానికి వీలున్నందున తక్కువ విద్యుత్తు ఖర్చయ్యేలా సౌర విద్యుత్తు దీపాల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎల్‌ఈడీ దీపాల వినియోగం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు. 

పొదుపుగా వాడితే  శ్రేయస్కరం : ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్తు పొదుపుగా వాడాలి. పీక్‌లోడ్‌ సమయంలో ప్రాసెసింగ్‌ పరిశ్రమలు తప్ప మిగిలినవన్నీ వాడకం ఆపేయాలి. ఆ సమయంలో గృహాల్లో ఏసీలు, గీజర్లు, నీటిమోటార్లను వినియోగించొద్దు. ప్రజల్లో అవగాహన పెంచే క్రమంలో.. అన్ని విద్యుత్తు కార్యాలయాల్లో ఏసీల వాడకం మానేసి ఫ్యాన్లు వాడుతున్నాం. కొద్దిరోజుల్లో పరిస్థితి కుదుటపడే వీలుంది. ప్రస్తుతానికి ఎక్కడా కరెంటు కోతలు విధించడం లేదు. -టి. మూర్తి, ఎస్‌ఈ, ఆపరేషన్‌ సర్కిల్‌  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని