టీకాజాలం!
eenadu telugu news
Published : 18/10/2021 01:30 IST

టీకాజాలం!

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయకున్నా దస్త్రాల్లో నమోదు

టీకా డోసులను జిల్లా నిల్వ కేంద్రం నుంచి పీహెచ్‌సీలకు తరలిస్తున్న సిబ్బంది

 

కాకినాడ వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొవిడ్‌ టీకా పంపిణీలో డొల్లతనం బయటపడింది. రెండో డోసు టీకా ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లుగా 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు గుర్తించారు. లక్కవరం, కాండ్రకోట, రాజపూడి, వేట్లపాలెం, డి.కేశవరం, జి.కొత్తపల్లి, ఊబలంక, ధవళేశ్వరం, కొత్తలంక, ఎన్‌.సూరవరం కాట్రేనికోన, సీతానగరం, ఏలేశ్వరం, శంఖవరం పీహెచ్‌సీలు, రాజమహేంద్రవరంలోని నారాయణపురం, ఏవీఏ వాంబే కాలనీ, అమలాపురంలోని భూపయ్య అగ్రహారం యూపీహెచ్‌సీల్లో లోపాలు జరిగినట్లు గుర్తించారు.

17 మందికి తాఖీదులు

ఆయా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 17 మంది వైద్యాధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.. ఈ వ్యవహారాన్ని వైద్య, ఆరోగ్యశాఖ. ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విచారణకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు 120 పీహెచ్‌సీలు, 28 యూపీిహెచ్‌సీల పరిధిలో టీకా పంపిణీ వివరాలపై ఆరా తీస్తున్నారు.. వ్యాక్సిన్‌ వృథా కోణంలో విచారించనున్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు 47.91లక్షల టీకా డోసులు వినియోగించారు. వీరిలో 33.91 లక్షల మందికి మొదటి, 14లక్షల మందికి రెండో డోసు ఇచ్చారు. ఈ లెక్కలను సైతం సరిచూడనున్నారు. .

 

నేటి నుంచి మెగా డ్రైవ్‌..

ఈ నెల 18, 19, 20 తేదీల్లో మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ప్రస్తుతం 3లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. శనివారం మరో 70వేల డోసులు వచ్చాయి. వీటన్నింటిని ఆదివారం వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు తరలించారు. మూడు రోజుల్లో రోజుకు లక్ష చొప్పున డోసుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు.

విచారణ వేగవంతం..

రెండో డోసు టీకా ఇవ్వకపోయినా, ఇచ్చినట్లు నమోదు చేసినట్లు గుర్తించిన వైనంపై క్షేత్రస్థాయి విచారణకు చర్యలు చేపట్టాం. టీకా పంపిణీ పక్కాగా నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. లోపాలు తేలితే చర్యలు తప్పవు. సోమవారం నుంచి ఈ వ్యవహారంపై విచారణ వేగవంతం చేస్తాం. -కేవీఎస్‌ గౌరీశ్వరరావు, జిలా వైద్యాధికారి

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని