అందుకోండి.. సామాజిక భద్రత
eenadu telugu news
Published : 18/10/2021 01:30 IST

అందుకోండి.. సామాజిక భద్రత

అసంఘటితరంగ కార్మికులకు ‘ఇ-శ్రమ్‌’ పోర్టల్‌


ఇ-శ్రమ్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకుంటున్న కార్మికులు

న్యూస్‌టుడే, కాకినాడ(వెంకట్‌నగర్‌) : కరోనా కాలంలో ఉపాధి కరవై అసంఘటితరంగ కార్మికులు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఆ సమయంలో వారి వెతలు వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ఇ-శ్రమ్‌ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. ఆగస్టు 26వ తేదీ నుంచి పోర్టల్‌ అందుబాటులోకి రాగా, రిజిస్ట్రేషన్ల సంఖ్యలో మన జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. కార్మికులు డిసెంబరు 31 వరకు తమ వివరాలను నమోదు చేసుకొనే అవకాశం ఉంది. జిల్లాలో సుమారు 15 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. ఇప్పటి వరకు 1,59,973 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు.

ఇవీ ప్రయోజనాలు

ఈ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి 12 అంకెల యూఐడీ గుర్తింపు సంఖ్య ఇస్తారు. దీని ద్వారా కేంద్రం అమలుచేసే పలు రకాల సంక్షేమ పథకాలు నేరుగా శ్రామికులకే అందనున్నాయి.

పనిచేసే చోట ఏదైనా ప్రమాదం సంభవించి అంగవైకల్యం ఏర్పడితే రూ. లక్ష, మరణానికి రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా వర్తించనుంది.

ఎవరు అర్హులంటే..

16-59 సంవత్సరాల మధ్య వయసున్నవారు ఈ పథకానికి అర్హులు. భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, ఇళ్లల్లో పనిచేసేవారు, వ్యవసాయ కూలీలు, వీధి వ్యాపారులు, చేతి వృత్తివారు, ఉపాధి హామీ కూలీలు, ఆశ వర్కర్లు, దుకాణాల్లో పనిచేస్తున్న వారు తమ వివరాలను నమోదు చేసుకోవచ్ఛు అయితే వారికి పీఎఫ్‌ కాని, ఇ.ఎస్‌.ఐ. కాని ఉండకూడదు.

నమోదు ఉచితం

ఇ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు కోసం ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఇందుకోసం సమీపంలోని కామన్‌ సర్వీసు సెంటర్‌ (సి.ఎస్‌.సి.), పోస్టాఫీసులో నమోదు చేస్తారు. కార్మికుల సహాయార్థం జిల్లా ఉప కార్మికశాఖ కార్యాలయంలో లేబర్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. అవగాహన ఉన్నవారు ఇ-శ్రమ్‌ పోర్టల్‌ ద్వారా తమ వివరాలను సొంతంగా కూడా నమోదు చేసుకోవచ్ఛు ఇందుకోసం ఆధార్‌ కార్డు నకలు, బ్యాంక్‌ ఖాతా నెంబరు, ఆధార్‌ కార్డుతో లింకై ఉన్న చరవాణి నెంబరు ఉండాలి.

అవగాహన కల్పిస్తాం

సాంకేతిక లోపంతో పోర్టల్‌ కాస్త ఇబ్బందికి గురిచేసినా ప్రస్తుతం ఆ సమస్య తీరింది. నమోదు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. ప్రతి కార్మికుడు తమ వివరాలు నమోదు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. -జి.లక్ష్మీనరసయ్య,ఉప కార్మిక కమిషనర్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని