అయ్యా.. బిల్లులు ఇప్పించరూ!
eenadu telugu news
Published : 19/10/2021 04:43 IST

అయ్యా.. బిల్లులు ఇప్పించరూ!


కలెక్టరేట్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న గుత్తేదారులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ కోరింది. ఈ మేరకు కలెక్టర్‌ సి.హరికిరణ్‌కు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శాంతారామ్‌, కార్యదర్శి వి.సత్యనారాయణ, కోశాధికారి ఎన్‌.సుబ్రహ్మణ్యం, కార్యవర్గ సభ్యులు వై.ప్రకాశరావు, ఎన్‌.ప్రసాదరావు వినతిపత్రం అందజేశారు. 13 జిల్లాల్లో సోమవారం నిర్వహించిన స్పందనలో వినతులు ఇచ్చామని, దీనిలో భాగంగా ఇక్కడ అర్జీ అందజేసినట్లు వారు తెలిపారు. జిల్లాలో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, మున్సిపల్‌, పోలీస్‌ హౌసింగ్‌, ఏపీడబ్ల్యూఐడీసీ, ఏపీఎంఎస్‌ఐడీసీ విభాగాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మాణం చేశామని, మూడేళ్లుగా రూ.300 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని చెల్లించి ఆదుకోవాలని వారు వేడుకున్నారు. నాబార్డు, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, ఏబీవీపీ శాఖలకు సంబంధించిన పనులు పూర్తిచేసినా, బిల్లులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో ఈ ఏడాది మార్చి నుంచి టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేదని తెలిపారు. పెండింగ్‌ బిల్లులు త్వరగా చెల్లించి, మా ప్రాణాలు కాపాడాలని విన్నవించారు. మా సమస్యను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి బిల్లులు చెల్లించేలా సహకారం అందించాలని అభ్యర్థించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని