ఆగిన శ్వాస ..రాలిన ఆశ
eenadu telugu news
Published : 19/10/2021 04:43 IST

ఆగిన శ్వాస ..రాలిన ఆశ

మన్యంపై మలేరియా పంజా


రంపచోడవరం ఆసుపత్రిలో జ్వర బాధితులు

న్యూస్‌టుడే, చింతూరు : తూర్పుమన్యం తల్లడిల్లుతోంది. ఏ ఇంట చూసినా జ్వరపీడితులే. వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి. స్థానికంగా సరైన వైద్యం అందక దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. వెళ్లే వరకు ఎన్ని ప్రాణాలు నిలుస్తాయో చెప్పలేని దుస్థితి. రంపచోడవరం, చింతూరులో ప్రాంతీయ ఆసుపత్రులు ఉన్నా పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది లేరు. చికిత్స చేస్తున్నా, పరిస్థితి విషమిస్తే ఇతర ప్రాంతాలకు ఆగమేఘాల మీద వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులూ రోగులతో కిటకిటలాడుతున్నాయి. వారు చెప్పినంత సొమ్ము ముట్టచెబుతున్నా నయమయ్యే వరకు నమ్మకం ఉండట్లేదు.

ఆసుపత్రి మెట్లు ఎక్కుతుండగానే..

నా బిడ్డకు... ఒకరోజు జ్వరం రావడంతో చింతూరు ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లాం. పరీక్షలు చేసి మలేరియా అన్నారు. రెండోరోజుకు విషమించడంతో భద్రాచలం తీసుకెళ్లాం. అక్కడ పరీక్ష చేసి డెంగీ అన్నారు. అక్కడి వైద్యులు చేతులెత్తేయడంతో ఖమ్మం తీసుకెళ్లాం. ఆసుపత్రి మెట్లు ఎక్కతుండగానే ప్రాణం పోయింది. పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామనుకుంటే, ఇలా జరిగింది. వ్యాధి నిర్ధారణలోనే జాప్యం. ఆపై సరైన వసతులు లేవు. ఈ సమస్య పరిష్కారమయ్యేలా అధికారులు చొరవ చూపాలి. - లక్ష్మి, యువతి తల్లి, ఎర్రంపేట

ప్రాణవాయువు అందేలోగా..

మా పాపకు పట్టుమని 14 నెలలైనా.. నిండలేదు. రెండ్రోజులు జ్వరం వస్తే చింతూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించాం. ప్లేట్‌లెట్ల సంఖ్య బాగానే ఉంది. విపరీతమైన నీరసం ఆవహించడంతో భద్రాచలం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాం. పరిస్థితి విషమించడంతో ఖమ్మం తీసుకెళ్లాం. అక్కడ ఆక్సిజన్‌ అందేలోగా మృతిచెందింది. దగ్గరలో మెరుగైన వైద్యం అందక, దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడకు వెళ్లేలోగా ప్రాణాలు పోతున్నాయి. -రియాజ్‌, చిన్నారి తండ్రి, చింతూరు

ఇవీ... వాస్తవమేనా..

రంపచోడవరం డివిజన్‌లో జనవరి నుంచి సెప్టెంబరు వరకు... 16 డెంగీ కేసులు, చింతూరు ఏరియా ఆసుపత్రి పరిధిలో 46 డెంగీ కేసులు నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ● ఏజెన్సీలోని రెండు డివిజన్లలో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు 86 కేసులు వచ్చాయని మలేరియా అధికారులు చెబుతున్నా, చింతూరు ప్రాంతీయ ఆసుపత్రిలోనే 498 కేసులు నమోదు కావడం గమనార్హం. ● గత నెలలో రంపచోడవరం, చింతూరు ఏరియా ఆసుపత్రుల్లో కలిపి సుమారు 1,425 మంది చికిత్స పొందారంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్ఛు అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాధితుల సంఖ్య పారదర్శకంగా చూపించట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య దీనికి అదనం.

16 మంది వైద్యులకు ముగ్గురే..

మన్యంలో వైద్యులు, సిబ్బంది పూర్తిగా లేక ఉన్నవారు ఒత్తిడికి గురవుతున్నారు. చింతూరులో ప్రాంతీయ ఆసుపత్రి ఉన్నా వైద్యులు, సిబ్బంది కొరత శాపంగా మారింది. సాధారణ రోగులు, ప్రమాదాల కేసులు, ప్రసవాలు, ఇతర రోగులతో కుస్తీ పడాల్సిందే.విలీన మండలాల్లో పీహెచ్‌సీల్లో 16 మంది వైద్యుల అవసరం ఉంటే.. ముగ్గురే ఉన్నారు. 20 నర్సు, 24 ఏఎన్‌ఎంలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

సర్వే చేయిస్తున్నాం..

ఏజెన్సీలో డెంగీ, మలేరియా విషజ్వరాల బాధితులను గుర్తించేందుకు ఏఎన్‌ఎంలు, గ్రామ కార్యదర్శులు సర్వే చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు చింతూరు ఆసుపత్రిలో ఇటీవల పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశాం. ఎమర్జెన్సీ కేసులను భద్రాచలం, రంపచోడవరం ఆసుపత్రులకు పంపుతున్నారు. వ్యాధి ప్రబలకుండా క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశాం. -ఎ.వెంకటరమణ, పీవో, చింతూరు ఐటీడీఏ

 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని