‘అప్పులతో రాష్ట్రం దివాలా’
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

‘అప్పులతో రాష్ట్రం దివాలా’


మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): అప్పులతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దివాలా తీయించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. రాజమహేంద్రవరం ఆనంరోటరీ హాలులో మంగళవారం జరిగిన సీపీఐ శాఖ కార్యదర్శుల జిల్లాస్థాయి కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత, ప్రస్తుత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వివరాలు వెల్లడిస్తే దానిపై ఇప్పటివరకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు అదానీకి కట్టబెడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధులు రాబట్టడంలో సీఎం వైఫల్యం చెందారని, నిర్వాసితులకు అన్యాయం జరుగుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. నవంబరు నుంచి పోలవరం నిధుల కోసం సీపీఐ పోరాట కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ ఉద్యమిస్తోందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, రైతు సంఘం నేత రావుల వెంకయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వలేకపోవడం విచారకరమన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు సీపీఐ శాఖల నిర్మాణ నివేదికను విడుదల చేశారు. తొలుత ప్రజానాట్య మండలి బృందం గేయాలతో అలరించింది. వర్క్‌షాపులో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు, సీపీఐ నాయకులు నల్లా రామారావు, తోకల ప్రసాద్‌, రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని