రబీ సాగుపై ముందుచూపు
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

రబీ సాగుపై ముందుచూపు

● సీలేరు అధికారులకు ఎస్‌ఈ లేఖ●

● జలవనరులశాఖ ఎస్‌ఈ రాంబాబు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: ఖరీఫ్‌సాగు సీజన్‌ డిసెంబరు నాటికి ముగుస్తుంది. వెంటనే రబీ సీజన్‌ వస్తుంది. గోదావరి జిల్లాల్లో రబీ సీజన్‌లో వరిసాగుకు ఎంతనీరు లభిస్తుందనే అంశంపై జలవనరులశాఖ ఇంజినీరింగ్‌ అధికారులు ఇప్పటి నుంచే చర్యలు మొదలు పెట్టారు. రబీలో సాగునీటి కోసం ఎక్కువగా సీలేరుపైనే ఆధారపడుతుంటారు. ఈ నేపథ్యంలో రబీకి ఎంతసాగునీరు విడుదలచేస్తారనే అంశంపై సీలేరు ఉన్నతాధికారులకు లేఖరాసినట్లు జలవనరులశాఖ ఎస్‌ఈ రాంబాబు మంగళవారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. రబీకి గోదావరిలో స్వయం జలవృద్ధి ద్వారా ఎంతనీరు లభించేది త్వరలో గణనచేస్తామన్నారు. సీలేరు నుంచి వచ్చే జలాలతోపాటు, గోదావరిలో స్వయం జలవృద్ధి ద్వారా లభించే నీటిని కలిపి రబీలో ఎంతమేర ఆయకట్టుకు సరిపోతుందో తెలుస్తుంది. ఉభయగోదావరి జిల్లాల్లో రబీలో సుమారు తొమ్మిది లక్షల ఎకరాల విస్తీర్ణంలో రబీసాగు చేస్తుంటారు. సుమారు 90 టీఎంసీల నీరు ఉంటే రబీలో పూర్తి ఆయకట్టుకు అనుమతించే పరిస్థితులు ఉంటాయి. ఈ నీటిలో సుమారు ఏడు టీఎంసీలు వరకు పరిశ్రమలు, రెండు జిల్లాలో తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. సీలేరు నుంచి ఎంత విడుదలచేస్తారు, అదే విధంగా గోదావరిలో స్వయంజలవృద్ధి ద్వారా ఎంతనీరు వస్తుందనే అంశంపై లెక్కలు కట్టిన తరువాత స్పష్టతవస్తుంది. నీటిలెక్కలు తేలిన తరువాత సాగునీటి సలహా మండలిలో చర్చించి రబీ ఆయకట్టుపై అధికారిక ప్రకటన చేస్తారు. నవంబరు మాసాంతానికి రబీలో సాగునీటి విడుదలపై పరిపూర్ణమైన స్పష్టత వస్తుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని