దాడులపై భగ్గుమన్న తెదేపా
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

దాడులపై భగ్గుమన్న తెదేపా


పోతవరంలో తెదేపా నాయకుల కొవ్వొత్తుల ప్రదర్శన

పి.గన్నవరం, రాజోలు, సఖినేటిపల్లి: మంగళగిరి, విశాఖపట్నంలో తెదేపా కార్యాలయాలపై దాడులు ఖండిస్తూ మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జిల్లాలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. అమలాపురం గడియారస్తంభం కూడలి వద్ద పార్టీ కార్యకర్తలు చేరుకుని ఆందోళన చేశారు. మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో వారంతా నినాదాలు చేశారు. పి.గన్నవరం, పోతవరం వద్ద ధర్నా చేపట్టారు. వైకాపా దాడులు మితిమీరిపోతున్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెదేపా నాయకులు ఆరుమిల్లి లాల్‌బాబు, సంసాని పెద్దిరాజు, చిన్నం బాలవిజయారావు, శేరు శ్రీనుబాబు, పడాల వెంకటేశ్వరరావు, మందపాటి కిరణ్‌కుమార్‌, ఆకుమర్తి ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు రాజోలు, సఖినేటిపల్లిలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని గొల్లపల్లి విమర్శించారు. దాడులకు దిగినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎంపీపీ కేతా శ్రీను, చాగంటి స్వామి, తాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..?’

కాకినాడ నగరం: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో.. లేదో తెలియడం లేదని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎస్‌ వర్మ పేర్కొన్నారు. కాకినాడలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన, ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడుతోందన్నారు. వైకాపా రౌడీయిజానికి ఇది నిదర్శమన్నారు. పోలీసు వ్యవస్థ రాజ్యాంగం బద్ధంగా ఉండాలి తప్ప, అధికార పార్టీకి కొమ్ముకాయడం తగదన్నారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అత్యయిక స్థితిని తలపించేలా..

గాంధీనగర్‌(కాకినాడ): రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన సాగుతోందని, అధికార పార్టీపై విమర్శలు చేస్తే రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యాలయాలపై భయంకరంగా దాడులు చేస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందన్నారు. పోలీసులు సైతం దాడులను ముందుగా గుర్తించకపోవడం, దాడులు చేస్తుంటే ప్రేక్షకపాత్ర పోషిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేసిన వారిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

బంద్‌ జయప్రదానికి పిలుపు

కాకినాడ కలెక్టరేట్‌: రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దాడులను నిరసిస్తూ బుధవారం బంద్‌కు తెదేపా పిలుపు నిచ్చిందని ఆ పార్టీ కాకినాడ పార్లమెంట్‌ అధ్యక్షుడు, జడ్పీ మాజీ ఛైర్మన్‌ జ్యోతుల నవీన్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లాలోని 19 నియోజకవర్గాల పరిధిలో ఆయా ఇన్‌ఛార్జుల ఆధ్వర్యంలో నిరసన తెలుపుతామన్నారు. ప్రజలు బంద్‌ను జయప్రదం చేసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు.

‘పథకం ప్రకారమే దాడి’

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: పథకం ప్రకారమే తెదేపా కార్యాలయాలపై దాడి జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇటువంటి ఘటనలు బట్టి తెలుస్తోందన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపి విమర్శించడం ప్రతిపక్షాల ప్రజాస్వామిక హక్కు అన్నారు. విమర్శలకు తట్టుకోలేక విధ్వంసాలకు పాల్పడడం ఆటవికమన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రజాస్వామిక విలువలను కాపాడాలన్నారు.

రంపచోడవరంలో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యేలు రాజేశ్వరి, వెంకటేశ్వరరావు, బాబూరమేష్‌ తదితరులు
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని