నకిలీ విత్తనాలతో నష్టపోయామనిరైతుల ఆందోళన
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

నకిలీ విత్తనాలతో నష్టపోయామనిరైతుల ఆందోళన

కిర్లంపూడి ప్రధాన రహదారిపై బైఠాయించిన బాధితులు

కిర్లంపూడి, న్యూస్‌టుడే: అమూల్య (స్వర్ణ) రకం నకిలీ విత్తనాలతో పంటను నష్టపోయామని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కిర్లంపూడి- సామర్లకోట ప్రధాన రహదారిపై మంగళవారం రెండు గంటల పాటు బైఠాయించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారు. కిర్లంపూడిలోని ఎరువుల దుకాణంలో ఖరీఫ్‌ సాగు కోసం 95 బస్తాల విత్తనాలు కొనుగోలు చేశామని రైతులు తెలిపారు. నాట్లు వేసిన నెల రోజుల వరకు పంట బాగా కనిపించిందన్నారు. అప్పటికే దుబ్బులో సగం వెన్ను ఈనిక పూర్తయిందని.. మిగిలిన సగం వెన్ను ఇప్పుడు ఈనిక దశకు చేరుకుందని.. ఈ పంటను ఏమి చేయాలో తెలియడం లేదని బాధిత రైతు పెట్టకోట శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. కిర్లంపూడి మండలంలో సుమారు 600 ఎకరాల్లో అమూల్య స్వర్ణ రకం పంటను సాగు చేసి నష్టపోయామని రైతులు బావురుమన్నారు. ఈ పరిస్థితిని నెల రోజుల క్రితమే వ్యవసాయాధికారులకు, విత్తన, ఎరువుల డీలరుకు మొర పెట్టుకున్నామన్నారు. నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పినా, ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు లేవన్నారు. నష్టపరిహారం ఇప్పించే వరకు ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో కిర్లంపూడి, చిల్లంగి, జగపతినగరం, రాజుపాలెం, రామకృష్ణాపురం, ముక్కొల్లు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని