ఎస్టీ-వాల్మీకి కుల ధ్రువపత్రాలపై విచారణ పూర్తి చేయండి
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

ఎస్టీ-వాల్మీకి కుల ధ్రువపత్రాలపై విచారణ పూర్తి చేయండి

అధికారులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: ప్రాథమిక విచారణ నివేదికలను అందజేయకుండా ఎస్టీ-వాల్మీకి కుల ధ్రువపత్రాల వాస్తవికతను తేల్చేందుకు విచారణకు హాజరుకావాలంటూ పిటిషనర్లకు తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌, జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ (డీఎల్‌ఎస్‌సీ) ఛైర్మన్‌ నోటీసులు ఇవ్వడం సరికాదని హైకోర్టు పేర్కొంది. బోగస్‌ కుల ధ్రువపత్రాల వ్యవహారంపై తహసీల్దార్ల బృందం ఇచ్చిన నివేదిక, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కలెక్టర్‌కు ఇచ్చిన నివేదికలను 8వారాల్లో పిటిషనర్లకు అందజేయాలని ఆదేశించింది. దీనివల్ల అధికారుల నోటీసులకు పిటిషనర్లు సరైన వివరణ ఇచ్చేందుకు వీలుంటుందని తెలిపింది. ఎస్టీ కుల బోగస్‌ ధ్రువపత్రాల ఆరోపణలపై విచారణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఇప్పటికే చాలా మందికి నోటీసులనిచ్చారని, బృందాలవారీగా విచారణ నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సూచించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.విజయలక్ష్మి ఇటీవల ఈ మేరకు పలు వ్యాజ్యాల్లో తీర్పునిచ్చారు. ఎస్టీ వాల్మీకి కుల బోగస్‌ ధ్రువపత్రాల వాస్తవికతను తేల్చేందుకు విచారణకు హాజరు కావాలంటూ 2019 జనవరిలో తూర్పుగోదావరి జిల్లా డీఎల్‌ఎస్‌సీ ఛైర్మన్‌ ఇచ్చిన నోటీసులను సవాలుచేస్తూ రాజవొమ్మంగి మండలంలోని పలు గ్రామాలవారు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. వారి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘1988 ఫిబ్రవరి 20న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా పిటిషనర్లకు కులధ్రువపత్రాలనిచ్చారు. విచారణకు ముందు తహసీల్దార్ల కమిటీ పిటిషనర్లకు నోటీసు ఇవ్వకుండా ప్రక్రియ పూర్తి చేసి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి నివేదిక సమర్పించింది. నివేదికల దస్త్రాలు పిటిషనర్లకు ఇవ్వలేదు’ అని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కౌంటర్‌ దాఖలు చేస్తూ.. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లో రెవెన్యూ అధికారులు ఎస్టీ కుల బోగస్‌ ధ్రువపత్రాలు ఎక్కువగా ఇస్తున్నారనే ఫిర్యాదులందాలయని అన్నారు. రాజవొమ్మంగి మండల పరిధిలో 2018 ఏప్రిల్‌నుంచి ఇచ్చిన ఎస్టీ ధ్రువపత్రాలను పరిశీలించేందుకు ఐదుగురు తహసీల్దార్ల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. 255 ధ్రువపత్రాల ఒరిజనల్‌ ఫైల్‌ కనుగొనలేదని, 123 ధ్రువపత్రాల గురించి స్థానిక విచారణలో తహసీల్దార్ల కమిటీకి అభ్యంతరాలు అందాయని పేర్కొన్నారు. దీంతో ధ్రువపత్రాల వాస్తవికతను తేల్చేందుకు డీఎల్‌ఎస్‌సీ విచారణ చేపట్టిందని వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని