విలీనానికి వేళాయె..
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

విలీనానికి వేళాయె..

● ఉన్నత పాఠశాలల్లోకి 399 ప్రాథమిక విద్యాలయాలు

నవంబరు ఒకట్నుంచి అమలుకు అవకాశం

సమీప ఉన్నత పాఠశాలలో కలవనున్న దంగేరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల

ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాన్ని విడుదల చేసింది. ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేస్తారు. నవంబరు ఒకటి నుంచి నూతన విద్యావిధానాన్ని 5+3+3+4 అమల్లోకి తెస్తారు. త్వరలో అధికారికంగా రాజపత్రం విడుదల అవుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. -న్యూస్‌టుడే, పామర్రు

నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా 250 మీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఆ పరిధిలోని ఉన్నత పాఠశాలలో కలిపేస్తారు. జిల్లాలో 399 ప్రాథమిక పాఠశాలలను 366 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడానికి ప్రణాళికలు వేశారు. సుమారు 36 వేలమంది విద్యార్థులు ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు డివిజన్లవారీగా సంబంధిత ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి వివరాలు పొందుపరిచారు.

తల్లిదండ్రుల ఆందోళన..

వాస్తవానికి ప్రతి ఆవాసంలోనూ ప్రాథమిక పాఠశాల ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రారంభించారు. రాష్ట్రంలో పాఠశాల విద్యను అభ్యసించిన వారిలో కేవలం 27శాతం మంది మాత్రమే కళాశాలలకు వెళ్తున్నారని, అదే రష్యాలో 84.5శాతం ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రాథమిక బడులు అందుబాటులో ఉంటేనే పిల్లలకు చదువుపై ఆసక్తి పెరుగుతుందని, దూరం పెరిగిపోతే పిల్లలు చదువులెలా సాగుతాయోనని, ఇప్పటికే కరోనాతో విద్యావ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు ఈ విలీన ప్రక్రియ విఘాతం కలిగిస్తుందని చెబుతున్నారు.

ప్రాథమిక పాఠశాలల్లోకి అంగన్‌వాడీ కేంద్రాలు..

మరో విలీన ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలలకు 250 మీటర్ల దూరంలోని అంగన్‌వాడీ కేంద్రాలను వీటిలో విలీనం చేస్తారు. తొలి దశలో 500 ఉన్నట్లుగా గుర్తించారు. జిల్లాలో 24 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 5,546 కేంద్రాలు. వీటిలో 5,113 ప్రధాన కేంద్రాలు కాగా, 433 మినీ కేంద్రాలు. ఆరు నెలల నుంచి మూడేళ్లలోపున్న విద్యార్థులు 1,60,876 మంది, మూడు నుంచి ఆరేళ్లవారు 94,070 మంది ఉన్నారు. ఇప్పుడు 500 కేంద్రాలకు సంబంధించిన పది వేల మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలకు తరలాల్సి ఉంటుంది. వీరిని పీపీ 1, ప్రిపరేటరీ 1, 2 తరగతులుగా పిలుస్తారు. ఇవే ప్రాథమిక పాఠశాలల్లో ఫౌండేషన్‌ తరగతులుగా నడుస్తాయి.

ముఖ్యాంశాలు ఇవీ..

ప్రాథమిక పాఠశాలల్లోని సెకండరీ గ్రేడు టీచర్లను 30 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున 1, 2 తరగతులకు కేటాయిస్తారు. మిగతా ఉపాధ్యాయులను తగినట్లుగా తరగతులకు కేటాయిస్తారు.

ఉన్నత పాఠశాలల్లో సౌకర్యాల్లేకుంటే.. ప్రస్తుతం నడుస్తున్నచోటే 3, 4, 5, తరగతులు నిర్వహిస్తారు.

3 నుంచి 10 తరగతులకు బోధించేవారికి వారానికి 32 బోధన కాలాంశాలు మించకుండా హెచ్‌ఎంలు చూస్తారు.

చురుగ్గా ప్రక్రియ

జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలల విలీన ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి దూరం, గదులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య తదితర విషయాలను క్రోడీకరించి వివరాలు రాష్ట్ర విద్యాశాఖకు పంపించాం. విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండానే చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రస్తుతం మున్సిపల్‌, నగర పాఠశాలలకు విలీనం మినహాయింపుఉంది. ప్రక్రియకు సంబంధించిన ముసాయిదా కూడా విడుదలైంది. దాని ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నాం. అన్నీ సవ్యంగా జరిగితే నవంబరు ఒకటో తేదీనుంచే కొత్త విధానం అమల్లోకి వస్తుంది. - ఎస్‌.అబ్రహం, డీఈవో


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని