స్వామి భూములు..స్వాహ !
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

స్వామి భూములు..స్వాహ !

● ఆక్రమణల చెరలో 430 ఎకరాలు ●

స్వాధీనానికి దేవాదాయశాఖ ముప్పుతిప్పలు

కోరుకొండ దేవస్థానం భూములు

న్యూస్‌టుడే, (కాకినాడ) గాంధీనగర్‌  : దేవుడి కైంకర్యాలకు విలువైన సంపదలు దానంగా ఇచ్చింది కొందరు.. వారి ఆశయాలకు తూట్లు పొడిచి.. దేవస్థానాల భూములకే ఎసరు పెడుతోంది మరికొందరు.. జిల్లాలో రూ. వందల కోట్ల విలువైన వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.. మరి వాటిని స్వాధీనం చేసుకోవడానికి దశాబ్దాల సమయం ఎందుకు పడుతోందన్న అనుమానం రాకమానదు.. దేవాదాయ శాఖలో కొందరు అధికారుల తీరు.. రాజకీయ జోక్యం కారణంగా పరిస్థితి తీసికట్టుగా మారుతోందన్నది బహిరంగ రహస్యంగా మారింది. ఇప్పటికైనా ఈ విషయంలో శాఖాపరంగా దృష్టి సారించి.. రూ.కోట్లాది విలువైన భూములు పరిరక్షించాల్సిన అవసరం ఉంది.

ఎందెందు వెతికినా...

జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన 6ఏ, 6బీ, 6సీ ఆలయాలు, సత్రాలు, మఠాలు 1,852 ఉన్నాయి. వీటికి సంబంధించి మాగాణి 18,312, మెట్ట 16,649 ఎకరాల మేర ఉన్నాయి. కొండలు, గుట్టలతో కూడినవి కూడా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న ఈ భూముల నుంచి ఏటా రూ.కోట్లలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు జమ కావాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో ఇందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. కొందరు దశాబ్దాలుగా ఆయా భూములను తమ వారసత్వ హక్కుగా సాగు చేసుకుంటూ నామమాత్రంగా లీజులు చెల్లిస్తున్నారు. ఒకవేళ వేలం పాటలు నిర్వహించినా ఖాళీ చేయకుండా తిష్ఠ వేస్తున్నారు. దీంతో పాట పాడేందుకు వచ్చేవారు కరవవుతున్నారు. ప్రసిద్ధి చెంచిన అంతర్వేది, కోరుకొండ లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానాలకు చెందిన వందలాది ఎకరాలు, రాజమహేంద్రవరంలోని కోటి లింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూముల్లో పక్కా భవనాలు నిర్మించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్ఛు

ఆదాయం.. అంతంతమాత్రం

అంతర్వేది: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 890 ఎకరాల పల్లం, మెట్ట భూములున్నాయి. వీటి నుంచి ఏడాదికి ధన, ధాన్యం రూపంలో సుమారు రూ.32 లక్షల ఆదాయం వస్తోంది. 890 ఎకరాల్లో అధికారికంగా 1,700మంది కౌలు రైతులుంటే అనధికారికంగా మరో 1,500 మంది ఉన్నారు. అంటే ఈ భూములు చేతులు మారిపోయాయి. వాటిలో సుమారు 500 గృహాలు, వందెకరాల్లో ఆక్వా చెరువులు తవ్వేశారు. చెరువులు తవ్విన వారు ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.60వేలు లీజు ఆదాయం పొందుతూ.. దేవస్థానానికి కేవలం నాలుగు నుంచి ఆరు బస్తాల ధాన్యం చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.కోటిపైనే శిస్తు బకాయిలు ఉన్నాయి.

చేతులు మారిపోయాయి..

కోరుకొండ: కోరుకొండలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి పూర్వం 1600 ఎకరాల వరకు భూములు ఉండేవని రికార్డుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 18 ఎకరాలు మాత్రమే ఆధీనంలో ఉండడం గమనార్హం. నేరుగా దేవస్థానం పేరుతో మరో వంద ఎకరాలున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం సాగుచేసుకుంటున్న వారి చేతుల్లోనే ఉన్నాయి. దేవస్థానం పేరుతో పూర్వం ఈనాం సర్వీసుల కింద ఇచ్చిన 870 ఎకరాల భూమి క్రయవిక్రయాలపై నిషేధం ఉంది. వందల ఎకరాల ఉన్న స్వామిని అన్నవరం దేవస్థానం ఆలనాపాలనా చూడాల్సి వస్తోంది.

ఇదండీ సంగతి..

జిల్లావ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 926 ఆలయాలు, సత్రాలు, మఠాలకు చెందిన 20,452.72 ఎకరాల పంటలు పండే వ్యవసాయ భూమి ఉంది. వాటిని మూడేళ్లకోసారి వేలంపాటల ద్వారా కౌలుకిస్తారు. ప్రస్తుతం 1,8021.23 ఎకరాలకు వేలంపాటలు నిర్వహించారు. 101.07 ఎకరాల మేర పాతవారికి లీజు పొడిగించగా, 1899.65 ఎకరాలను మాత్రం కొందరు ఎలాంటి అనుమతులు పొందకుండానే అనుభవిస్తున్నారు. 430.77 ఎకరాలు ఆక్రమణల్లో మగ్గుతోంది. క్షేత్రస్థాయిలో పలువురు ఈవోలు, అథికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో ఆక్రమణదారులు ఆడిందే ఆటగా సాగిపోతోంది.

యుద్ధప్రాతిపదికన చర్యలు..

ఆక్రమణలకు గురైన దేవస్థానాల భూముల స్వాధీనానికి ట్రైబ్యునల్‌ ద్వారా కృషి చేస్తున్నాం. ఖాళీ ప్రదేశాలకు రక్షణ కల్పించాలని ఈవోలను ఆదేశించాం. భూముల్లో బోర్డులు పెట్టాలని సూచించాం. పట్టణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను 11 సంవత్సరాల లీజుకు ఇచ్చేలా ప్రతిపాదనలు అమలు చేస్తున్నాం. లీజులు ముగిసినా ఖాళీ చేయకుంటే, పక్కా భవనాలు నిర్మిస్తున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించడంతోపాటు, చట్ట పరంగా చర్యలు తీసుకుంటున్నాం. -ఎం.విజయరాజు, దేవాదాయ శాఖ ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఎస్‌డీసీ

 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని