తక్షణ వైద్యం.. అందని దైన్యం
eenadu telugu news
Published : 22/10/2021 05:59 IST

తక్షణ వైద్యం.. అందని దైన్యం


ఆసుపత్రిలో ఈసీజీ గది వద్ద నిరీక్షణ

ఈనాడు డిజిటల్‌ - రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే - రాజమహేంద్రవరం వైద్యం : రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి నగరం చుట్టుపక్కల నుంచే కాక ఏజెన్సీ, పశ్చిమగోదావరి జిల్లా నుంచి వందల్లో రోగులు చికిత్సకు వస్తారు. ప్రమాదం, ఆత్మహత్య వంటి అత్యవసర కేసులు రోజుకు 30 నుంచి 40 దాకా వస్తుంటాయి. కానీ... ఇక్కడ వైద్యుల కొరత, కొందరు సిబ్బంది నిర్లక్ష్యం వెరసి పేదల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సరైన చికిత్స అందక కొందరు మరణిస్తుంటే.. మరికొందరి పరిస్థితి విషమిస్తోంది.

సామగ్రికీ కొరతే

పనిచేయని సీటీ స్కాన్‌

●●ఆసుపత్రిలో తగినన్ని స్ట్రెచర్లు, చక్రాల కుర్చీలు అందుబాటులో లేవు. సిబ్బంది నిర్లక్ష్యంతో కొన్ని మరమ్మతులు లేక మూలనపడ్డాయి. అత్యవసర విభాగంలో కొన్నిసార్లు బాధితులను.. వారి బంధువులే క్యాజువాలిటీ దాకా మోసుకెళ్లాల్సి వస్తోంది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో వైద్యపరీక్షలకు రోగి తాలూకు బంధువులే చక్రాల కుర్చీలు, స్ట్రెచర్లలో తీసుకెళ్తున్నారు. కొన్నిసార్లు రోగిని నడిపించి తీసుకెళ్తున్నారు. ●●● ఆసుపత్రిలో రెండే ఈసీజీ పరికరాలు ఉన్నాయి. ఇన్‌పేషెంట్‌, ఔట్‌పేషెంట్లకు పరీక్షలు చేయడానికి ఒక్క నిపుణుడు ఉన్నారు. దీంతో రోగులు గంటల కొద్దీ నిరీక్షించాల్సిందే. ●●● ఉన్న ఒక్క అంబులెన్సు 5 నెలల కిందట మూలనపడినా మరమత్ముల ఊసేలేదు. అత్యవసర వేళ రోగులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ●●● ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ యంత్రం ఏడాదిన్నరగా పనిచేయడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో దీని మరమ్మతులకు రూ.50 లక్షలు కేటాయించినా.. అందుబాటులోకి రాలేదు. కొందరు రోగులు ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయిస్తూ.. రూ.3-10 వేల వరకు వెచ్చిస్తున్నారు.

రోజంతా నరకయాతన

గుంటూరు జిల్లా నుంచి విశాఖ వెళ్తున్న లారీ తెల్లవారుజామున ఆటోనగర్‌ సమీపంలో ట్రాలీని ఢీకొంది. క్లీనర్‌, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఇద్దరినీ రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉదయం 10 గంటలకు ఎంఆర్‌ఐ పరీక్షకు సూచించగా.. డ్రైవర్‌ కాలిలో గత ప్రమాదం తాలుకూ.. స్టీల్‌ రాడ్‌ ఉండటంతో ఎంఆర్‌ఐ కుదర్లేదు. ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ లేదనీ.. కాకినాడ రిఫర్‌ చేశారు. అంతదూరం వెళ్లడానికి భయపడిన బంధువులు ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లో రూ.8 వేలు వెచ్చించి సీటీ స్కాన్‌, ఇతర పరీక్షలు చేయించారు. రాత్రి 9 గంటలకు నివేదిక వచ్చింది. అప్పటికే సర్జికల్‌ నిపుణుల విధులు ముగియడంతో.. బంధువులు ఆయనను గుంటూరులోని ఆసుపత్రికి తరలించారు.

తల్లడిల్లిన మాతృమూర్తి

రాజమహేంద్రవరం వాసి కనక హారిక ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. నొప్పులు ఎక్కువ కావడంతో శస్త్రచికిత్స చేసైనా బిడ్డను తీయాలని బంధువులు కోరితే.. సంబంధిత సిబ్బంది స్పందించలేదు. ఒకరోజు గడిచాక చికిత్స చేయడంతో అప్పటికే బిడ్డ చనిపోయాడు. ఆ తల్లి రోదన చూపరులను కంటతడి పెట్టించింది.

ఎవరూ లేరని వదిలేశారు

హనుమంతు... విజయవాడ నుంచి శ్రీకాకుళం కారులో వెళ్తుండగా దివాన్‌చెరువు వద్ద ప్రమాదానికి గురయ్యాడు. పొత్తి కడుపులో స్టీరింగ్‌ చొచ్చుకుపోయింది. అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినా.. స్థానికంగా తెలిసినవారు ఆయన వెంట లేరు. ఈనేపథ్యంలో అడ్మిషన్‌ తీసుకోలేదని ఉదయం 9 గంటలకు బంధువులు వచ్చే వరకు కనీసం ప్రథమ చికిత్స కూడా చేయలేదు. బాధితుడి పరిస్థితి విషమించడంతో బంధువులు విజయవాడ తరలించే క్రమంలో ప్రాణాలు వదిలాడు.

సిబ్బంది లేరాయే

కొవిడ్‌ రెండో దశలో విధుల్లోకి తీసుకున్న సుమారు 150 మందిని గత నెల 25న ప్రభుత్వం తొలగించడంతో ఆసుపత్రిలో సిబ్బంది కొరత తలెత్తింది. అత్యవసర విభాగంలోనిసాధారణ, జూనియర్‌ వైద్యులను ఇతర విభాగాల్లో నియమించడంతో క్యాజువాలిటీ వద్ద ఇబ్బందిగా ఉంది. గతంలో ఇద్దరు ముగ్గురు ఉండే దగ్గర ప్రస్తుతం.. ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ప్రాణాపాయ, ప్రమాద, ఆత్మహత్య తదితర కేసులు వస్తుండటంతో.. ఉన్న ఒక్కరే అన్ని చూసుకోవాల్సి వస్తోంది. బాధితులకు తక్షణ వైద్యసేవలు అందక పరిస్థితి చేయి దాటుతోంది.

సమస్యలు చక్కదిద్దుతాం..

ఆసుపత్రిలో వైద్యుల కొరత వాస్తవమే. ఉన్న వారిని అన్ని విభాగాలకు సర్దుబాటు చేస్తున్నాం. అత్యవసర విభాగం క్యాజువాలిటీలో రాత్రుళ్లు ఇద్దరు వైద్యులు ఉంటున్నారు. సిబ్బంది కొరతతో ఉదయం ఒక్కరే ఉంటున్నారు. అన్ని విభాగాల్లో స్పెషలిస్టులు ఉన్నారు. త్వరలో అంబులెన్సు అందుబాటులోకి తెస్తాం. ఆసుపత్రికి వచ్చిన వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తాం. -బీసీకే నాయక్‌, సూపరింటెండెంట్‌, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని