సైబరాసురులపై స్పార్క్‌ సమరం
eenadu telugu news
Published : 22/10/2021 06:03 IST

సైబరాసురులపై స్పార్క్‌ సమరం

 


పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌తో మోసాలను వివరిస్తున్న ప్రతినిధి

న్యూస్‌టుడే, ప్రత్తిపాడు, ఏలేశ్వరం : వినోదం, సమాచారం, ఆర్థిక లావాదేవీలు తదితరాలన్నీ చక్కబెట్టేందుకు చరవాణినే వినియోగిస్తాం. ఇదే సందర్భంలో అంతర్జాలం ఆధారంగా చరవాణి వాడకంలో సైబర్‌ నేరగాళ్ల నుంచి ముప్పు ఉందనే విషయాన్ని గమనించాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే నష్టపోకుండా ఉంటాం. అందుకు తగిన అవగాహన అవసరం. సైబర్‌ నేరాలను అరికట్టేందుకు స్పార్క్‌ (సైంటిఫిక్‌ ప్రోగ్రాం ఫర్‌ అకడెమిక్‌ రీసెర్చ్‌ క్యూబ్‌) పోలీసుల ప్రోత్సాహంతో కృషి చేస్తోంది. ఇదేదో అంతర్జాతీయ సంస్థేమీ కాదు. పక్కా లోకల్‌. ఏలేశ్వరంలోని సాయిసందీప్‌ బృందం ఏర్పాటు చేసుకున్న వేదిక.

కార్యశాలలతో అవగాహన

పది మంది సభ్యులున్న స్పార్క్‌ ఇప్పటివరకు 72 ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ సెమినార్‌లు నిర్వహించింది. పాఠశాల, కళాశాలలకు వెళ్లి సైబర్‌దాడుల నుంచి రక్షించుకునే అంశాలను వివరిస్తున్నారు. రేడియో వేవ్‌ హ్యాకింగ్‌పై అప్రమత్తం చేస్తున్నారు. తూర్పు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కార్యశాలలు నిర్వహించినట్లు డైరెక్టర్‌ సాయిసందీప్‌ తెలిపారు. నెట్‌లో సమస్యలను గమనించి, వాటి పరిష్కారాలను అన్వేషించి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ సిద్ధం చేసుకుని కార్యశాలకు వెళ్తారు. సైబర్‌ సవాళ్లు, నేరాలు జరగకుండా రక్షించే వైట్‌ హేట్‌ హ్యాకర్‌, పెన్‌టచ్‌ కోర్సులను చదివారు. చరవాణి, కంప్యూటర్లు, ఇతర సామాజిక మాధ్యమ వేదికల్లో ఏం చేయకూడదో తెలిస్తే ఏ నెటిజెనూ ఇబ్బందిపడడని ఈ బృందం చెబుతోంది. దాంతోపాటు శాస్త్ర, సాంకేతిక అంశాలు, సామాజిక సమస్యలపై తోటి విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు.

లింకు జోలికి వెళ్తే అంతే..

ఉదంతాల ఆధారంగా నెట్‌లో ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కలిగించడం స్పార్క్‌ కార్యశాల ముఖ్య ఉద్ధేశం. వీరు సూచించే అంశాల్లో కొన్ని..

అనవసర లింకులు, సైట్ల జోలికి వెళ్లొద్ధు

స్పామ్‌లో ఉండే ఈ మెయిల్స్‌ను కదపొద్ధు

ఇంట్లో కూర్చుని సంపాదన అనే సందేశాలపై ఆలోచించాలి.

పరిచయం లేని, మూడో వ్యక్తి చేతికి చరవాణి ఇవ్వకూడదు.●

చరవాణిలోకి స్పై అనే బగ్‌ చేరనీయకూడదు.

రెండు నెలలకోసారి ఫోన్‌ రీస్టార్ట్‌ చేయడం మంచిది.

తరచూ పాస్‌వర్డ్‌ మార్చుకుంటూ ఉంటే మేలు.

గిఫ్ట్‌ వోచర్లకు ఆశపడకపోవడం మంచిది.

ఓటీపీ అడిగితే.. చెప్పకపోవడం ఉత్తమం.

అనవసర యాప్‌లు ఉంచకూడదు.

చదువుతూ.. సేవలందిస్తూ..

ఏలేశ్వరానికి చెందిన సాయిసందీప్‌ తన తమ్ముడు ప్రదీప్‌, మరో ముగ్గురితో ఏడాదిన్నర క్రితం ‘స్పార్క్‌’ను ఆరంభించారు. సైబర్‌ నేరాల నుంచి యువతను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళానికి చెందిన మిత్రులు మోక్షిత, సాయి, కీర్తి తదితర 20 మంది వీరికి తోడయ్యారు. వీరంతా డిగ్రీ తత్సమాన కోర్సుల చదువుతున్నావారే.వీరితో పోలీసు అధికారులు కార్యశాలలు ఏర్పాటు చేస్తున్నారు.

పాకెట్‌ మనీతో ప్రారంభించాం

స్పార్క్‌ నిర్వహణకు పాకెట్‌ మనీనే ఖర్చుపెడుతున్నాం. అన్‌లిమిటెడ్‌ డేటా వాడుకుంటూ అంతుచిక్కని సమస్యల బారినపడకుండా వీలైనంత మందికి అవగాహన కల్పించాలని సంకల్పించాం. సంబంధిత నెట్‌ కోర్సులు చదివి, మేం నేర్చుకున్నదే మరిందరికి వివరిస్తున్నాం. నేను ప్రస్తుతం బీఎస్సీ చదువుతున్నా. నా మిత్రులూ చక్కగా చదువుతున్నవారే. మాకు ఉన్నతోద్యోగాలు చేయాలనే లక్ష్యాలున్నాయి. అదే సమయంలో సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలనుకుంటున్నాం. - ఎస్‌.సాయిసందీప్‌, స్పార్క్‌ డైరెక్టరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని