స్మార్ట్‌ నగరం.. ట్రాఫిక్‌ గ్రహణం
eenadu telugu news
Published : 23/10/2021 02:17 IST

స్మార్ట్‌ నగరం.. ట్రాఫిక్‌ గ్రహణం


నిర్మాణ దశలో కొండయ్యపాలెం పై వంతెన

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం.. స్మార్ట్‌ సిటీ కాకినాడను ట్రాఫిక్‌ సమస్య వీడడం లేదు. ప్రతిపాదించిన పైవంతెనలు(ఆర్‌వోబీ) రెండు సాకారమైనా, మరొకటి పదేళ్ల నుంచి అందుబాటులోకి రావడం లేదు. విశాఖపట్నం, తుని, కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ, యానాం, అమలాపురం, రాజోలుకు కాకినాడ మీదుగా వందలాది వాహనాలు రోజూ రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ఆర్టీసీ సర్వీసులు మినహా మిగతావి కాకినాడ నగరంలోకి రాకుండా బైపాస్‌ రోడ్డు ప్రతిపాదించారు. అయిదేళ్లుగా ఇది అందుబాటులోకి రాలేదు. కొండయ్యపాలెం పైవంతెన, ఏటిమొగ వద్ద వంతెన, బైపాస్‌ పూర్తి కాకపోవడంతో నగర ప్రజలకు ట్రాఫిక్‌ ఇక్కట్లు తప్పడంలేదు. ఎన్టీఆర్‌ వారధి అప్రోచ్‌ రోడ్డు కొంతభాగం కూలిపోవడంతో మరిన్ని ట్రాఫిక్‌ కష్టాలకు కారణమవుతోంది. జిల్లాలో కత్తిపూడి నుంచి గుడిమెల్లంక వరకు సుమారు 125 కి.మీ మేర 216 జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. కత్తిపూడి నుంచి తిమ్మాపురం వరకు విస్తరించిన రహదారి అందుబాటులోకి వచ్చింది. తిమ్మాపురం నుంచి చొల్లంగిపేట వరకు బైపాస్‌ 18.4 కి.మీ మేర నిర్మాణం చేశారు. బైపాస్‌ పూర్తయినా రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్ద పైవంతెనల నిర్మాణం చేయలేదు. దీంతో బైపాస్‌ రోడ్డు అందుబాటులోకి రాలేదు. దీన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

రెండో బైపాస్‌

కాకినాడ పోర్టుకు రాకపోకలు సాగించే వాహనాలు నగరంలోకి రాకుండా రద్దీని నియంత్రించడానికి ఉప్పుటేరుపై వంతెన, బైసాస్‌ రోడ్డు ప్రతిపాదించారు. 2017 అక్టోబరు 30న ఈ బైపాస్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీనికి స్టేజ్‌-1 కింద 19.85 ఎకరాల భూసేకరణకు రూ.116.2 కోట్లు మంజూరు చేశారు. ఉప్పుటేరు పై వంతెనతో పాటు అక్కడి నుంచి జగన్నాథపురం శివారు బాలయోగి విగ్రహం వరకు రెండు లైన్లు(23 అడుగులు) బైపాస్‌ రోడ్డును 2.872 కి.మీ మేర నిర్మాణానికి నిర్ణయించారు. భూసేకరణ అలైన్‌మెంట్‌ మార్చాలని కొందరు ప్రజాప్రతినిధులు పట్టుపట్టడంతో ప్రస్తుతం ఇది అటకెక్కింది. ఇది సాకారమైతే అచ్చంపేట కూడలి నుంచి పోర్టు మీదుగా వచ్చే వాహనాలు నగరంలోకి రాకుండా ఏటిమొగ నుంచి యానాం వైపునకు 216 జాతీయ రహదారికి అనుసంధానం అవుతాయి.

పైవంతెన అంతేనా

నగరంలో కీలకమైన కొండయ్యపాలెం పై వంతెన(ఆర్‌వోబీ) నిర్మాణం పూర్తికావడంలేదు. దీనికి ఇప్పటికే రెండు, మూడుసార్లు శంకుస్థాపనలు చేశారు. 2010లో 750 మీటర్ల పొడవున పై వంతెన, 600 మీటర్ల వరకు రహదారి విస్తరణ పనులకు రూ.65 కోట్లు మంజూరు చేశారు. దీనిలో రూ.15.60కోట్లతో వంతెన, రహదారి నిర్మాణం, మిగతా సొమ్ముతో భూసేకరణ చేయడానికి నిర్ణయించారు. దీనికి ఇద్దరు గుత్తేదారులు మారారు. భూసేకరణ పూర్తయ్యి ఆర్‌అండ్‌బీకి స్థలం అప్పగించారు. వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎప్పటికి పూర్తి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

డిసెంబరు నాటికి పూర్తిచేస్తాం

నగరంలో కొండయ్యపాలెం పైవంతెన నిర్మాణ పనులు డిసెంబరు నాటికి పూర్తిచేస్తాం. దీన్ని త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు పూర్తికావొచ్చింది. రామారావుపేట శివాలయం కూడలి నుంచి పొట్టిశ్రీరాములు విగ్రహం కూడలి వరకు రెండు వరుసల రహదారిని కూడా నిర్మాణం చేయనున్నాం. దీన్ని వీలైనంత త్వరగా చేపడతాం. ఏటిమొగ వద్ద వంతెన, బైపాస్‌ నిర్మాణం పనులకు సంబంధించి భూసేకరణ పెండింగ్‌లో ఉంది. ఇది పూర్తి చేసి, స్థలం అప్పగిస్తే నిర్మాణ పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. 216 జాతీయ రహదారికి అనుబంధంగా నిర్మాణం చేసిన బైపాస్‌ రోడ్డు అంశం జాతీయ రహదారుల శాఖ పరిధిలో ఉంది. - వెంకటేశ్వరరావు, కార్యనిర్వాహక ఇంజినీరు, కాకినాడ, ఆర్‌అండ్‌బీ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని