ప్రవేశకాలం.. అవుదాం సన్నద్ధం
eenadu telugu news
Published : 23/10/2021 02:17 IST

ప్రవేశకాలం.. అవుదాం సన్నద్ధం


కాకినాడ జేఎన్‌టీయూకే కళాశాల

న్యూస్‌టుడే, కాకినాడ(భానుగుడిసెంటర్‌) : ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన తొలి విడత ఈ నెల 25వ తేదీనుంచి ప్రారంభం కానుంది. జిల్లావ్యాప్తంగా ఈ పరీక్షకు ఇంజినీరింగ్‌ విభాగంలో 17,183 మంది దరఖాస్తు చేసుకోగా 16,275 మంది హాజరయ్యారు. వీరిలో 13,247 మంది అర్హత సాధించారు. జిల్లాలో 28 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. జేఎన్‌టీయూకే, నన్నయ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండగా, మిగిలినవి ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నాయి. వీటిలో మొత్తంగా 11,927 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కన్వీనర్‌ కోటా కింద 9 వేల సీట్లు ఉంచారు. ఈ నెల మొదటి వారంలో నోటిఫికేషన్‌కు సన్నాహాలు చేసినా రుసుములు నిర్ధారణ కాకపోవడంతో ఇప్పటివరకు వాయిదా పడింది. గతేడాది ధ్రువపత్రాల పరిశీలన, ఐచ్ఛికాల ఎంపికకు వేర్వేరు తేదీలు ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం ప్రక్రియ వారంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలను సహాయ కేంద్రాలుగా కేటాయించే అవకాశం ఉంది. జిల్లాలో కళాశాలల సంఖ్యపై శుక్రవారం ఉన్నత విద్యామండలి సమావేశం నిర్వహించి తుది జాబితాను విడుదల చేయనుంది. దీంతో ర్యాంకుల ప్రకారం ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఎప్పుడనేది శనివారం ఖరారు చేస్తారు.

హెల్ప్‌లైన్‌ వినియోగించుకోవాలి

ర్యాంకుల ప్రకారం తేదీలను ప్రకటిస్తాం. ముందుగా ఈ నెల 25న ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ ఆప్షన్లు, కళాశాల, బ్రాంచి ఎంపికలపై స్పష్టత వస్తుంది. అభ్యర్థులు తమ లాగిన్‌ ఐడీ ద్వారా ఆప్షన్ల ఎంపికను జాగ్రత్తగా చేసుకోవాలి. మొదట ప్రాధాన్యం గల కళాశాలలను క్రమపద్ధతిలో ఎంపిక చేసుకోవాలి. అవసరమైతే జిల్లాలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్లను వినియోగించుకోవాలి. - విప్పర్తి రవీంద్ర, కన్వీనర్‌, ఏపీఈఏపీ సెట్‌

ఈ పత్రాలు వెంట తీసుకురావాలి

ధ్రువపత్రాలకు సంబంధించి ఇంటర్మీడియట్‌ మార్కుల ధ్రువపత్రం ఇంకా రాలేదు. మెమో మాత్రమే అందుబాటులో ఉంది. దీనిపై సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌ సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం, 4వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఒరిజినల్‌ స్టడీ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలి. కొవిడ్‌ నిబంధనలు అనుసరించి సెంటర్లకు రావాలి. మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. - బాలాజీ, జేఎన్‌టీయూకే సహాయ కేంద్రం సమన్వయకర్త

జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు : 2

సీట్లు: జేఎన్‌టీయూకే : 407, నన్నయ 200

ప్రైవేటు కళాశాలలు : 28

వీటిలో సీట్లు : 11,320

ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు : 13,247

కన్వీనర్‌ కోటా సీట్లు : 9,000

డీమ్డ్‌వర్సిటీ కన్వీనర్‌ కోటా సీట్లు : 35 శాతం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని