నూరు శాతం ...టీకాయుష్మాన్ భవ
eenadu telugu news
Updated : 23/10/2021 06:34 IST

నూరు శాతం ...టీకాయుష్మాన్ భవ


కాకినాడలో కొవిడ్‌ టీకా వేస్తున్న సిబ్బంది

ఈనాడు, కాకినాడ: కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గినా.. వైరస్‌ వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గలేదు.. మాస్కు తప్పనిసరి అని చెబుతున్నా.. లెక్కచేయక కొందరు కరోనా బారిన పడుతున్నారు. వరుస పండుగలు, ఇతర కార్యక్రమాలతో పరిస్థితి అదుపు తప్పుతుందేమోనన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. మహమ్మారిని దీటుగా ఎదుర్కోవాలంటే.. టీకా తప్పనిసరి అంటున్నా.. కొందరిలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఈ

పరిస్థితి చక్కదిద్దడానికి యంత్రాంగం శ్రమించాల్సి వస్తోంది. జిల్లా జనాభాలో 84 శాతం మందికి తొలి డోసు టీకా వేశామంటున్నా.. అత్యధిక జనాభా ఉన్న జిల్లా టీకా పంపిణీలో అగ్రస్థానంలో ఉన్నా.. నూరుశాతం లక్ష్యం సాధించాలంటే క్షేత్రస్థాయి మరింత చైతన్యం నింపాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొవిడ్‌ కేసుల తీవ్రతలో.. రికవరీలో జిల్లా రాష్ట్రంలో మొదటి, మరణాల్లో మూడో స్థానంలో ఉంది. ఈ పరిస్థితి చక్కదిద్దడానికి తొలిదశ కొవిడ్‌ టీకా కార్యక్రమం ఈ ఏడాది జనవరి 16న, రెండోదశ ఫిబ్రవరి 1న ప్రారంభించారు. ప్రజల్లో చైతన్యం నింపి.. లక్ష్యాలు చేరుకోవడానికి అధికారులు ఆపసోపాలు పడాల్సివస్తోంది.

ముందుకొస్తేనే మేలు..

జిల్లాలో 236 శాశ్వత వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటుతోపాటు..అడపాదడపా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. నేరుగా ప్రజల వద్దకే వెళ్లి టీకా వేసుకోండి మహాప్రభో అంటూ బతిమాలుతున్నా స్పందన తక్కువగా ఉంటోంది. వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ముందుకురానివారిలో హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతోపాటు.. ఇతర వర్గాల వారూ ఉన్నారు. జిల్లాలో 3.50 లక్షల డోసుల వ్యాక్సిన్‌ నిల్వలు సిద్ధంగా ఉన్నా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. టీకా వేసుకుంటే జ్వరం వస్తుంది.. పండగ వెళ్లాక వేయించుకుంటామని కొందరు... అనారోగ్య కారణాల పేరుతో ఇంకొందరు తప్పించుకుంటున్నారు. టీకా వేయించుకుంటే మరణాల వరకు వెళ్లే పరిస్థితి ఉండదని చెబుతున్నా కొందరిలో చైతన్యం లోపించడం సమస్యగా మారింది.

ఒత్తిడిలో ఒడిదొడుకులు..

వైద్యారోగ్య శాఖలో సిబ్బంది కొరత ఉన్నా.. వారిముందు భారీగా టీకా లక్ష్యాలున్నాయి. వ్యాక్సిన్‌ వేసుకోని వారి జాబితాలను సిద్ధంచేసి ఆశ, ఏఎన్‌ఎంలకు వైద్యారోగ్యశాఖ అందిస్తోంది. వారు సచివాలయాల వారీగా ఇళ్లవద్ద నిరీక్షిస్తున్నా కొన్నిచోట్ల సహకరించడం లేదు. దీంతో ఒత్తిడికి గురవుతున్న సిబ్బంది తప్పు లెక్కలు వేస్తున్నారు. ఈ తరహా లోపాలపైనా దృష్టిసారించారు. ● గతంలో నిర్దేశిత లక్ష్యంగా ఎంచుకున్నవారికి కాకుండా ఇతరులకు వేసిన వ్యవహారం వివాదాస్పదమైంది. టీకా వృథా కాకుండా.. ఎవరికో ఒకరికి అందుతున్నట్లు గుర్తించినా, ఈ తరహా అక్రమాల కట్టడికి తరువాత చర్యలు తీసుకున్నారు. ● వ్యాక్సిన్‌ వేయకుండానే వేసినట్లు చూపిన వ్యవహారంపై ఇటీవల 17 మంది వైద్యాధికారులకు శ్రీముఖాలు అందిన విషయం తెలిసిందే.

లక్ష్యం చేరుకునేలా..

జిల్లాలో నూరుశాతం టీకా లక్ష్యానికి చేరువైన గ్రామాలు చాలా ఉన్నా.. కొద్దిమంది వ్యాక్సిన్‌కు దూరంగా ఉండడంతో ప్రక్రియ పూర్తయిందని చెప్పలేని పరిస్థితి. ● రాజమహేంద్రవరం, అమలాపురం డివిజన్లతోపాటు మన్యంలోనూ కొన్నిప్రాంతాల్లో వెనుకబాటు కనిపిస్తోంది. ● తొలి, రెండో డోసులు వేయించుకోనివారిపై దృష్టిసారించారు. ● గడచిన వారం రోజులుగా నిత్యం 40వేల మందికి తగ్గకుండా టీకా వేస్తున్నారు. ప్రజలు సహకరిస్తే ప్రక్రియ సమర్థంగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.

84 % మందికి తొలిడోసు

జిల్లాలో 18ఏళ్లు దాటిన జనాభాలో 84 శాతం మందికి తొలి డోసు వ్యాక్సిన్‌ వేశాం. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌లో జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. దేశంలోనే అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లా మనది. ఇటీవల వరుస పండగలు వచ్చాయి. రాకపోకలు పెరిగాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే అర్హులందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని చైతన్యపరుస్తున్నాం. - కీర్తి చేకూరి, జేసీ

నిల్వ కేంద్రంలో వ్యాక్సిన్‌

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని