
ఉభయ గోదావరి జిల్లాల కవులు, రచయితల సంఘం ఏర్పాటు
రాజానగరం: ఉభయ గోదావరి జిల్లాల కవులు, రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘం అధ్యక్షుడు, నన్నయ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ తరపట్ల సత్యనారాయణ బుధవారం చెప్పారు. రాజమహేంద్రవరంలోని మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ సభ్యుడు, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ ముఖ్యఅతిథిగా పాల్గొని సంఘం లోగో ఆవిష్కరించారన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రచయితలు, కవులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడం, సాహిత్య వ్యాప్తికి కృషిచేసే కవులు, రచయితలకు గుర్తింపు కల్పించడం వంటివి సంఘం ద్వారా చేస్తామన్నారు. ఉభయ జిల్లాల్లో కవులు, రచయితలను ఒకే వేదిక మీదకు తీసుకురావాలనే సంకల్పంతోనే సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంఘం రాజమహేంద్రవరం, ఏలూరు, కాకినాడ, నిడదవోలు ప్రధాన కేంద్రాలుగా పనిచేస్తుందన్నారు. కత్తిమండ ప్రతాప్ సంఘం గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు సత్యనారాయణ తెలిపారు.