Updated : 13/01/2021 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సాహితీ సేవకుడు నాగళ్ల దుర్గాప్రసాద్‌ ఇకలేరు  

కొల్లూరు (గుంటూరు జిల్లా): ‘ప్రజ్వలిత’ సాహితీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగళ్ల  వెంకట దుర్గా ప్రసాద్‌ (56) ఇకలేరు. రంగస్థల, సామాజిక, సాంస్కృతిక రంగాలకు ఎంతో సేవ చేసిన ఆయన మంగళవారం రాత్రి విజయవాడలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. గతంలో కరోనా బారినపడి కోలుకున్నప్పటికీ తదనంతరం ఆయన్ను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం కొల్లూరు మండలంలోని ఆయన స్వగ్రామమైన అనంతవరంలో భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. దుర్గాప్రసాద్‌ మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, సాహితీ ప్రియులు, కళారంగ అభిమానులు, కళాకారులు  విచారం వ్యక్తంచేశారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌; సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, హోంమంత్రి మేకతోటి సుచరిత భర్త, ఐఆర్‌ఎస్‌ అధికారి మేకతోటి దయాసాగర్‌, అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరి శివప్రసాద్‌, సినీనటుడు నాయుడు గోపీ తదితరులు ఉన్నారు. దుర్గాప్రసాద్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడిగానూ ఆయన పనిచేశారు. అనంతరం ప్రజ్వలిత సామాజిక, సాంస్కృతిక సాహితీ సంస్థను స్థాపించారు. ఆ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతూ వచ్చిన ఆయన.. తెనాలి ప్రాంతంలో కళల అభివృద్ధికి, ముఖ్యంగా మరుగున పడిపోతున్న రంగస్థల నాటకాభివృద్ధికి ఎంతగానో కృషిచేశారు. పేద కళాకారులకు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు కళా వైభవం పేరిట భాషా సాహితీ సంస్కృతి అభివృద్ధి కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నలుమూలల ఉన్న కళాకారులను పిలిచి తెనాలిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి తనదైన ముద్రను వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అప్పట్లో పరుచూరి గోపాలకృష్ణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సినీ రచయిత జాలాది తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా తెనాలిలో రంగస్థల కళాకారుల కోసం దాతల సహకారంతో ఆయన భవనాన్ని నిర్మించారు.

ఆ పదబంధం దుర్గాలాంటి వాళ్లకోసమే పుట్టివుంటుంది!

‘‘నాగళ్ల దుర్గాప్రసాద్‌ లేరనే వార్త తెలిసినప్పటినుంచి మనసుని కుంగదీస్తోంది. అతడే ఒక సైన్యం అనే పదబంధం వీరి కోసమే పుట్టివుంటుంది. సాంస్కృతిక రంగంలో విప్లవకారుడు ఎలా ఉండాలో దుర్గా జీవించి చూపాడు. తెలుగు సంస్కృతిలోని వైవిధ్యం గురించి దుర్గా చెబుతుంటే ఎంతటి పండితుడైనా ‘ఔరా’ అనాల్సిందే. దుర్గా నిష్క్రమణతో తెలుగు సాంస్కృతిక రంగంలో ఏర్పడే వెలితి మరో దుర్గా పుట్టేదాకా పూడదు.. కామ్రేడ్‌ దుర్గా.. మిస్సింగ్‌ యూ!’’

‘‘సాహిత్య జీవులంటే గుండె పిండుకొనే వ్యక్తి. ముఖ్యంగా తెనాలి ప్రాంతానికి చెందిన రచయత్నీ, కవుల్ని భుజాన మోసే వ్యక్తిగా.. సాహితీలోకానికి గొప్ప ప్రియుడిగా ఉన్నారు. ఆయన మరణ వార్త బాధను మించిన బాధగా ఉంది. గండం తప్పిందనుకున్నాం. మిత్రులందరం ఊపిరి పీల్చుకున్నాం. తప్పినట్టే భ్రమపెట్టి అన్న ఆయువును పట్టుకెళ్లింది. ఎంత అనారోగ్యంతో ఉన్నా యువోత్సాహంతో ఉరకలెత్తుతూ అందరినీ నవ్విస్తూ ఉండేవారు. దుర్గా మరణంతో మా తెనాలి సాంస్కృతిక కూడలి కూలిపోయింది. ఎన్నో సాహిత్య ఆశలు కాలిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సాహితీ కార్యకర్త తెలియని సాహిత్యజీవులు లేరంటే ఆశ్చర్యం లేదు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ - గుంటూరు లక్ష్మీనరసయ్య, సాహితీవేత్తTags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని