ఆక్సిజన్‌ రైలొచ్చింది
logo
Published : 17/05/2021 05:56 IST

ఆక్సిజన్‌ రైలొచ్చింది

న్యూ గుంటూరు రైల్వే స్టేషన్లో కృష్ణబాబు, జేసీ దినేష్‌కుమార్‌ తదితరులు

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ అవసరాలు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల డిమాండ్‌ మేరకు అవసరమైన ప్రాణవాయువు సరఫరాలో సమస్యలు రాకుండా చూసేందుకు రైళ్ల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇందులో భాగంగా గుజరాత్‌ రాష్ట్రం జామ్‌నగర్‌ నుంచి 4 ట్యాంకుల్లో 76.39 మెట్రిక్‌ టన్నులతో తొలి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు న్యూగుంటూరు స్టేషన్‌కు ఆదివారం తెల్లవారుజామున చేరింది. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో గత రెండు రోజుల నుంచి ఆ స్టేషన్‌ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆక్సిజన్‌ను ప్రత్యేక వాహనాల్లో తరలించగలిగారు. గుజరాత్‌ రాష్ట్రం జామ్‌నగర్‌ నుంచి ఈనెల 14న రాత్రి 8.31 నిమిషాలకు బయలుదేరిన ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు తొలుత తెలంగాణ రాష్ట్రంలోని సనత్‌నగర్‌కు శనివారం సాయంత్రం వెళ్లింది. అక్కడ నుంచి బయలుదేరి న్యూగుంటూరు స్టేషన్‌కు ఆదివారం ఉదయం 04.12 గంటలకు చేరింది. మొత్తం 1,854 కి.మీ దూరం ప్రయాణించిన ఈ రైలు సరాసరి గంటకు 58.85 కి.మీ వేగంతో నడిచింది. ఈ రైలు గరిష్ఠ వేగంగా నడిచేందుకు వీలుగా గ్రీన్‌ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. రైల్వే శాఖ సవాలుగా తీసుకుని మార్గంలో ఎటువంటి అవరోధాలు ఎదురుకాకుండా గమ్యస్థానానికి నిర్దేశిత సమయంలో చేరేవిధంగా చూడగలిగినట్లు సీనియర్‌ మండల వాణిజ్య అధికారి నరేంద్రవర్మ, సీనియర్‌ డీవోఎం రాంబాబు తెలిపారు.

ప్రాణవాయువు వృథా కారాదు..

కరోనా బాధితుల ప్రాణాల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లు కొవిడ్‌ టాస్క్‌ఫోర్సు కమిటీ ఛైర్మన్‌ కృష్ణబాబు తెలిపారు. అదే సమయంలో అవసరం లేకపోయినా ఆక్సిజన్‌ కావాలని రోగులు కోరడం మంచి విధానం కాదన్నారు. ఏ రోగికి ప్రాణవాయువు అవసరమా? లేదా?ఎంత మోతాదులో ఇవ్వాలో వైద్యులే నిర్ణయిస్తారన్నారు. అదే సమయంలో ఆక్సిజన్‌ వినియోగంపై అంతర్గతంగా ఆడిట్‌ నిర్వహించాలని స్థానిక అధికారులకు సూచించామన్నారు. ఆక్సిజన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కారాదన్నారు.

జిల్లాలో గరిష్ఠ వినియోగం: రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేనివిధంగా గుంటూరు జిల్లాలో 4 వేలకుపైగా ఆక్సిజన్‌ పడకలున్నాయని జిల్లా సంయుక్త పాలనాధికారి దినేశ్‌కుమార్‌ తెలిపారు. మనదగ్గర కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉందన్నారు. దీంతో ప్రతి రోజు 85 నుంచి 90 మెట్రిక్‌ టన్నుల ప్రాణవాయువు అవసరమవుతోందన్నారు. ప్రస్తుతం జీజీహెచ్‌కు కాకుండా 65 నుంచి 70 టన్నులు సరఫరా చేయగలుగుతున్నామన్నారు. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వచ్చినందున కొంత ఊరట లభిస్తుందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని