ఒక్క రోజే 11వేల నమూనాల సేకరణ
logo
Published : 17/05/2021 05:56 IST

ఒక్క రోజే 11వేల నమూనాల సేకరణ

ఈ ఏడాదిలో ఇదే ప్రథమం

ఈనాడు, అమరావతి : జిల్లాలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అనుమానిత లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెద్దఎత్తున చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఒక్క రోజే అత్యధికంగా 11,191 మంది నుంచి నమూనాలు సేకరించారు. ఈ ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో పరీక్షలు చేయడం ఇదే ప్రథమమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. జిల్లా యంత్రాంగం పరీక్షల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యమిస్తోందని యంత్రాంగం చెబుతోంది.. ఆదివారం నిర్వహించిన 11 వేలకు పైగా పరీక్షల్లో ఆర్టీపీసీఆర్‌ 8129 మందికి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి యాంటీజెన్‌ పరీక్షలు 2301 మందికి, ట్రూనాట్‌ 761 మందికి చేశారు. శనివారం నిర్వహించిన పరీక్షల్లో 4276 మందికి సంబంధించిన నమూనాల ఫలితాలు పెండింగ్‌ ఉన్నాయి. మార్చి నెల అంతా కలిపి 26,878 కేసులు నమోదైతే ఏప్రిల్‌లో ఆదివారం వరకు 28,344 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఏప్రిల్‌లో వైరస్‌ తీవ్రత బాగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. గత రెండు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే జరుగుతోంది. ఆ సర్వేలో కూడా చాలా మంది జ్వరంతో బాధపడుతున్నట్లు యంత్రాంగం గుర్తించి వారికి వైరస్‌ పరీక్షలు చేయడం ప్రారంభించింది. అందువల్లే ఆదివారం అత్యధికంగా 11వేలకు పైగా పరీక్షలు జరిగాయని వైద్యవర్గాలు వెల్లడించాయి. కర్ఫ్యూ అమలు తదితరాల వల్ల కొంచెం కేసులు తగ్గుముఖం పట్టాయని అంటున్నారు. ఈ నెల 18తో రెండు వారాల కర్ఫ్యూ పూర్తవనుంది. తిరిగి దాన్ని పొడిగిస్తారా లేదా అనేది వేచిచూడాలి.

పట్టణాల్లో తగ్గని తీవ్రత

వైరస్‌ తీవ్రత పట్టణాల్లోనే అత్యధికంగా ఉంటోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1787 కేసులు, 9 మరణాలు సంభవించాయి. వీటిల్లో జిల్లా కేంద్రం గుంటూరులో 578, మంగళగిరి 130, నరసరావుపేట 111, తాడేపల్లి 98, తెనాలి 46 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ పట్టణాల్లో వైరస్‌ కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతాల్లో బాగా కేసులు వస్తున్నాయి. జిల్లాలో కర్ఫ్యూ అమల్లో ఉన్నా పెదకాకాని, అమరావతిలో ఉన్న ఆలయాలకు భక్తులు వస్తూనే ఉన్నారు. ఈ రెరడు చోట్ల భక్తుల రాకపోకలతో కేసులు పెరుగుతున్నాయని జిల్లా అధికారులు గుర్తించారు. ఆదివారం అత్యధికంగా పెదకాకానిలో 51, అమరావతిలో 31 కేసులు వెలుగుచూడడం ఇక్కడ నెలకొన్న వైరస్‌ తీవ్రతను తెలియజేస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని