ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం
eenadu telugu news
Published : 04/08/2021 01:48 IST

ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం


ఏర్పాట్లపై అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌హాఫీజ్‌తో చర్చిస్తున్న
కలెక్టర్‌ వివేక్‌యాదవ్, చిత్రంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 

మంగళగిరి, న్యూస్‌టుడే: నగరంలోని ఎయిమ్స్‌లో 5న జరిగే వనమహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌  తెలిపారు. ఆయన మంగళవారం ఉదయం ఎయిమ్స్‌ ఆవరణలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సభా వేదిక, ఇతర ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. మొత్తం రెండు వేలమంది సభకు హాజరవుతారని అందులో వార్డు వాలంటీర్లు, వార్డు సచివాలయ ఉద్యోగులు, స్థానిక ప్రజలు, ఎన్‌సీసీ కేడెట్‌లు, మెప్మా బృందాలు, ఎయిమ్స్‌ వైద్య విద్యార్థులు ఉంటారని ఆయన వెల్లడించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, అటవీ శాఖ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారని, కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సభలో భౌతిక దూరం ఉండేలా కుర్చీల అమరిక ఉంటుందని ఆయన చెప్పారు. 400-500 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే, జేసీ దినేష్‌కుమార్, అదనపు ఎస్పీ ఈశ్వరరావు, డీఎస్పీ డి.దుర్గాప్రసాద్, డీఎఫ్‌వో రామచంద్రరావు, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక కమిషనర్‌ పి.నిరంజన్‌రెడ్డి, అదనపు కమిషనర్‌    హేమమాలిని, ఎంపీడీవో రామప్రసన్న పాల్గొన్నారు.

సీఎం షెడ్యూల్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 5న ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 16వ నంబరు జాతీయ రహదారి మీదుగా వడ్డేశ్వరం వద్ద నుంచి ఎయిమ్స్‌ ఆవరణకు చేరుకుంటారు. 10.15 గంటలకు అటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ పరిశీలిస్తారు. 10.20 గంటలకు ఆవరణలో మొక్కలు నాటుతారు. 10.28 గంటలకు వేదిక పైకి చేరుకుంటారు. 10.50 నుంచి 11.20 గంటలకు ప్రసంగిస్తారు. 11.30 గంటలకు రోడ్డు మార్గానా తిరుగు ప్రయాణమై 11.40 గంటలకు తాడేపల్లిలోని తన అధికారిక నివాసానికి చేరుకుంటారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని