వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బంది పెడితే చర్యలు
eenadu telugu news
Published : 05/08/2021 00:57 IST

వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బంది పెడితే చర్యలు


ఫోన్‌లో ఫిర్యాదు స్వీకరిస్తున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. బుధవారం పోలీసు కార్యాలయం నుంచి ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 20 మంది ఫిర్యాదు చేశారు. ఎస్పీ నేరుగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను నమోదు చేసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులతో జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారనే అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. నరసరావుపేటకు చెందిన ఓ గర్భిణి తన కుటుంబ సభ్యులతో సమస్యగా ఉందని, పోలీసు కార్యాలయానికి రాలేని పరిస్థితుల్లో ఫోన్‌ ఫిర్యాదు చేస్తున్నట్లు తెలపడంతో వెంటనే స్పందించిన ఎస్పీ ఆమె సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. తెనాలి రూరల్‌ పెదరావూరుకు చెందిన ఓ వృద్ధురాలు ఆస్తి విషయంలో తనను కుమారుడు వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్పీ స్పందిస్తూ ఆమె వద్దకు తెనాలి రూరల్‌ పోలీసులు వెళ్లి సమస్య పరిష్కరించాలని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆ ప్రాంతాల్లో విజుబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ఈసందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి పోలీసు కార్యాలయానికి రాలేని వారి కోసం ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో ప్రథమంగా ప్రారంభించినట్లు భావిస్తున్నామని తెలిపారు. పిడుగురాళ్లకు చెందిన నాగేశ్వరరావు గత 28 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న సమస్యను దీని ద్వారా ఎస్పీకి తెలియజేయడంతో వెంటనే అక్కడి ఎస్సై చరణ్‌ను పంపించి పరిష్కరించడం జరిగిందని చెప్పారు. వయోవృద్ధులు, దివ్యాంగులను ఇబ్బంది పెట్టినా, దాడి చేసినా వారిపై సీనియర్‌ సిటిజన్‌ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, భయబ్రాంతులకు గురిచేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రతి సోమవారం స్పందనలో, బుధవారం డయల్‌ యువర్‌ ఎస్పీ 8688405050కి ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. వాట్సప్‌ సహాయ కేంద్రం నంబర్‌ 8866268899కు ఫొటోలు, వీడియోలు, ఫిర్యాదులు పంపించవచ్చని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని