నవ చైతన్యం.. సుపరిపాలన
eenadu telugu news
Published : 05/08/2021 00:57 IST

నవ చైతన్యం.. సుపరిపాలన

కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ
పంచాయతీరాజ్‌ చట్టంపై అవగాహన


పంచాయతీరాజ్‌ చట్టంపై సర్పంచులకు అవగాహన కల్పిస్తున్న ఈటీసీ ప్రిన్సిపల్‌ వెంకట్రావు

బాపట్ల, న్యూస్‌టుడే గ్రామ పంచాయతీల్లో ప్రజలకు సుపరిపాలన అందించటంలో సర్పంచులదే కీలకపాత్ర. పంచాయతీ ఆదాయ వనరులు పెంచి మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు సద్వినియోగం చేసి గ్రామాన్ని ప్రగతి పధంలో నిలపాలి. పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేసి స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దాలి. గ్రామస్థులకు రక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రథమ పౌరులపై ఉంది. గ్రామసభల ద్వారా సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొత్త ఎన్నికైన సర్పంచులకు పంచాయతీ చట్టం, విధులు, హక్కులు, అధికారాలపై అవగాహన కల్పించి చైతన్యవంతుల్ని చేయటానికి బాపట్ల విస్తరణ శిక్షణ కేంద్రంలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. గ్రామ పాలకులు ఉత్సాహంగా పాల్గొని కొత్త విషయాలు తెలుసుకున్నారు. ఐదేళ్ల పాలనలో ప£ల్లెల్లో తమదంటూ ప్రత్యేక అభివృద్ధి ముద్ర వేయాలని తపిస్తున్నారు. ఈనేపథ్యంలో సర్పంచులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

మంచి పాలన అందిస్తాం: అనిత
గ్రామ పంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్ని రకాల నిధులు వస్తాయో తెలుసుకున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటాం. మంచి పాలన అందించటానికి అంకితభావంతో పని చేస్తాం. మొక్కలు నాటించి పచ్చదనాన్ని పెంచుతాం. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి వ్యాపారాలు చేసేలా ప్రోత్సహిస్తాం.

స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దుతాం: తిరుపతయ్య, నరసింహారావు 
ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి పనులు చేపడతాం. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి వ్యర్థాల వేర్వేరుగా సేకరించి కంపోస్టు ఎరువు తయారు చేయించి విక్రయించటం ద్వారా స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దుతాం. వీధి దీపాలకు సౌర విద్యుత్తు వినియోగిస్తాం. యువత చిన్న చిన్న వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తాం. వీధుల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటాం. 

మహిళాభ్యుదయానికి పెద్ద పీట: రమ్య, సాహితీప్రియ 
మూడో రోజుల శిక్షణ తరగతుల్లో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. మహిళల అభ్యున్నతికి పెద్ద పీట వేసి వారి ఆదాయం పెంచటానికి ప్రత్యేకంగా కృషి చేస్తాం. ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందిస్తాం. సర్పంచిగా విధులు, అధికారాలపై మంచి అవగాహన ఏర్పడింది. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టటానికి పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తాం. ఏటా గ్రామ పంచాయతీ బడ్జెట్కు రూపకల్పన చేసి పారదర్శకంగా నిధులు ఖర్చు చేస్తాం.

ప్రగతి పథంలో నిలుపుతాం: ఆనంద్‌ జ్యోత్స్న, రాజకుమారి 
సర్పంచికి ఉండే హక్కులు, అధికారాలు తెలుసుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులకే అందేలా చూస్తాం. గ్రామసభలు పక్కాగా నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకుంటాం. గ్రామ పంచాయతీ ఆదాయ వనరులు పెంచటానికి గట్టిగా కృషి చేస్తాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించి విశ్వాసం చూరగొంటాం. పల్లెను ప్రగతి పథంలో నడుపుతాం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని