తెల్లబంగారం వన్నె తగ్గింది.. హాలికుడి ఆశ ఆవిరైంది 
eenadu telugu news
Published : 05/08/2021 00:57 IST

తెల్లబంగారం వన్నె తగ్గింది.. హాలికుడి ఆశ ఆవిరైంది 

నిలువునా ముంచిన గులాబీ పురుగు
దిగుబడులు తగ్గి.. గిట్టుబాటు కాక పంటకు దూరం

గత రెండు దశాబ్దాల కాలంలో పత్తి సాగు విసీˆ్తర్ణం రికార్డు స్థాయిలో ఎగబాకింది. జిల్లాలో 1.80 లక్షల హెక్టార్ల సాగు మార్కును చేరుకుంది. రెండేళ్ల నుంచి గులాబీరంగు పురుగు పంటపై తీవ్ర ప్రభావం చూపింది. దిగుబడులు నేలకొరిగాయి. నాణ్యత కొరవడింది. ధరలు దిగజారాయి. ఫలితంగా తెల్ల బంగారం పండించే రైతుల మోము తెల్లబోయింది.  సింహభాగం రైతులు అప్పులను మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో రైతులు ప్రత్తి సాగుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ పంట నుంచి వైదొలిగి ఇతర పంటలపై ఆలోచన చేయాల్సి వచ్చింది. 

ఈనాడు, గుంటూరు తెల్ల బంగారంగా పేరుగాంచిన పత్తి పంట బీటీ విత్తనాల రాకతో ఒక వెలుగు వెలిగింది.. అన్ని రకాలుగా అనుకూల పంటగా పేరొంది రైతుల మన్ననలు అందుకుంది. అయితే అనూహ్యంగా గత రెండేళ్లుగా గులాబీ రంగు పురుగు రైతుల ఆశలను వమ్ము చేసింది. ఈ పంట మిగిల్చిన నష్టాల నుంచి బయటపడేందుకు అన్నదాతలు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా కొందరు మిర్చి వైపు మళ్లగా ఇంకొందరు అపరాలను ఎంచుకున్నారు. తాడికొండ మండలంలో కొందరు రైతులు వేరుసెనగ పంటను ప్రయోగాత్మకంగా వంద ఎకరాల్లో సాగుచేశారు. ఈ ప్రాంతంలో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వేరుసెనగ పంట సాగులోకి వస్తోంది. సాగు కాలం, పెట్టుబడులు, కూలీల అవసరం తదితర అంశాలతో పోల్చితే వేరుసెగన చాలా అనుకూలమని రైతులు అభిప్రాయపడుతున్నారు. 

*జిల్లాలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం 1.80 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటివరకు 66 వేల హెక్టార్లలో మాత్రమే పంట సాగయింది. గతేడాది ఇదే సమయానికి 1.21 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చింది. ఆగస్టు రెండో వారంతో పత్తి విత్తు సమయం ముగియనుంది. కానీ ఇప్పటికీ మూడో వంతు విస్తీర్ణంలో మాత్రమే విత్తనాలు నాటారు. ఎకరం పత్తి సాగుకు సగటున రూ.20వేలు పెట్టుబడి, రూ.10వేలు కౌలు, తీత ఖర్చులు రూ.10వేలు కలిపితే మొత్తం ఎకరానికి రూ.40వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. సగటున దిగుబడులు 7 నుంచి 10 క్వింటాళ్ల మధ్యనే ఉంటున్నాయి. నాణ్యత, తేమ, ఇతర సమస్యల కారణంగా మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసినా క్వింటాకు రూ.5వేలు మించడం లేదు. ఈ లెక్కన జిల్లా సగటున 8 క్వింటాళ్లు వేసుకున్నా రైతు పెట్టిన పెట్టుబడి మాత్రమే తిరిగి వస్తోంది. దిగుబడి తగ్గితే ఆ మేర నష్టాలు చవిచూస్తున్నారు. పంట సాగు నుంచి దిగుబడులు చేతికొచ్చేవరకు చేసిన శ్రమకు రూపాయి కూడా దక్కడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, గులాబీ పురుగు, ఎడతెరిపి లేని అధిక వర్షాలు పత్తి పంటను వెంటాడటంతో రైతులకు నష్టాలే మిగిలాయి. ఈ పరిణామాలు సాగు నుంచి రైతు వైదొలగడానికి కారణమవుతోంది. 

మెజారిటీ మిర్చి సాగుకే మొగ్గు 
పత్తి సాగు చేస్తున్న పొలాల్లో కాలువల కింద నీటిలభ్యత ఉన్నట్లయితే మొక్కజొన్న, జొన్న, అపరాల సాగుకు మొగ్గుచూపుతున్నారు. ప్రధాన వాణిజ్య పంట మిర్చి సాగుకు ఎక్కువ మంది సన్నద్ధమవుతున్నారు. ఏడాదికాలంగా మిర్చి ధరలు స్థిరంగా కొనసాగుతుండటం, సంకర విత్తనాల సాగుతో దిగుబడులు ఆశాజనకంగా ఉండటం రైతులకు కలిసివస్తోంది. పెట్టుబడులు పెట్టే మొత్తం ఎక్కువగా ఉన్నా దిగుబడులు, ధర కలిసొచ్చి వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు రూ.లక్షకుపైగా మిగిలే వెసులుబాటు ఉన్నందున అటువైపు మళ్లుతున్నారు. ఈసారి సాగర్‌కు సకాలంలో నీరు రావడం కూడా రైతులను మిర్చి సాగుకు సన్నద్ధం చేస్తోంది. 

మెట్ట భూముల్లో కంది పంట
మెట్టభూముల్లో అయితే కంది సాగుకు అసక్తి కనబరుస్తున్నారు. కందికి మద్దతు ధర క్వింటాకు రూ.6వేలు ఉండటం, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తుండటంతో రైతులు కంది పంట వైపు చూస్తున్నారు. నీటి సౌకర్యం ఉన్న పొలాల్లో అయితే ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్లు దిగుబడి వస్తోంది. పెట్టుబడి ఖర్చు పెద్దగా ఉండటం లేదు. నూర్పిడికి యంత్రాలు రావడంతో పని సులభమైంది. ఎకరాకు రూ.20వేలకు పెట్టుబడి మించకపోవడం, కనీసం రూ.20వేల వరకు మిగులు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు ఈపంట సాగుకు సమాయాత్తమవుతున్నారు. తాడికొండ మండలంలో వేరుసెనగ కూడా ప్రయోగాత్మకంగా వంద ఎకరాల్లో ఈ ఏడాది సాగుచేశారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నట్లయితే ఈ పంట విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని