అమ్మఒడి అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధం
eenadu telugu news
Published : 16/09/2021 01:56 IST

అమ్మఒడి అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధం

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే అమ్మఒడి పథకంలో అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధమైంది. ఇదే సందర్భంలో అర్హత ఉండి లబ్ధికి దూరంగా ఉన్న వారికి సాయం అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమ్మఒడి ఫేజ్‌-2లో లబ్ధి పొందిన వారి అర్హతల పరిశీలనకు నమునాగా కొందరిని విద్యా శాఖ విచారణ చేసింది. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది లబ్ధిదారుల అర్హతను పునఃపరిశీలన చేయగా పలు లోపాలు బయటపడ్డాయి. సాంకేతిక పొరపాట్లతో కొందరు అర్హులైనప్పటికీ నగదు బ్యాంకు ఖాతాలకు జమ కాలేదని తేలింది. అలాంటి వారికి లబ్ధి అందేలా చూడటంతో పాటు అనర్హులను జాబితా నుంచి తొలగించేందుకు సమగ్ర విచారణకు కమిటీలు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఆర్‌జేడీలకు మార్గదర్శకాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా జిల్లాలోనూ అనర్హుల విచారణ ప్రక్రియ మొదలు కానుంది.
* ఒక కుటుంబంలో ఒక విద్యార్థికే అమ్మఒడి లబ్ధి అందించాలన్నది ప్రభుత్వ నిబంధన. నరసరావుపేట వెంగళరెడ్డినగర్‌కు చెందిన పఠాన్‌ గౌసియాబేగంకు ఇద్దరు పిల్లలు 7, 4వ తరగతి చదువుతూ అమ్మఒడి లబ్ధి పొందారు. అదే పట్టణం బరంపేటకు చెందిన షేక్‌ సైదాబి కుమారులిద్దరూ 9, 6వ తరగతి చదువుతూ అమ్మఒడి నగదు అందుకున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎలా లబ్ధి అందిందనే వివరాలను అధికారులు పరిశీలించనున్నారు. ఒకరికి తల్లి వివరాలు.. మరొకరికి గార్డియన్‌గా వేరొకరిని చూపించి లబ్ధి పొంది ఉంటారనే అనుమానాలు వ్యక్త   
మవుతున్నాయి.  
* గుంటూరుకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని ఫర్హీనా, ఏడో తరగతి విద్యార్థి సూర్యతేజ, తాడేపల్లి మండలం వడ్డేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి దేవరపల్లి ఈశ్వరమ్మ, పొన్నూరు మండలం నిడుబ్రోలు ఎంపీయూపీ పాఠశాల మూడో తరగతి విద్యార్థిని వై.అఖిల అమ్మఒడి లబ్ధికి అర్హులయ్యారు. వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయినట్లు సెల్‌ఫోన్లకు సంక్లిప్త సందేశం వచ్చింది. ఖాతాలో మాత్రం జమ కాలేదు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంకు చెందిన ఈవూరి త్రిశంకరెడ్డి తల్లి బ్యాంకు ఖాతా నంబరు తప్పుగా నమోదై అమ్మఒడి నగదు జమ కాలేదు. వారికి సొమ్ము అందేలా చర్యలు తీసుకోనున్నారు.
నియోజకవర్గానికి 100 మందిని సర్వే చేస్తేనే ఎన్నో లోపాలు బయటపడిన నేపథ్యంలో అందరి అర్హతను పునఃపరిశీలన చేసే అవకాశాలు ఉన్నట్లు విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. అమ్మఒడి అనర్హుల ఏరివేత జరగనుందనే సమాచారం కొందరిలో గుబులు రేపుతుండగా అర్హత ఉండి లబ్ధికి దూరమైన వారు ఈసారైనా తమకు సాయం అందేలా చూస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని