పత్తి ధరహాసం!
eenadu telugu news
Published : 16/09/2021 01:56 IST

పత్తి ధరహాసం!

ఈనాడు, అమరావతి జిల్లాలో ముందస్తుగా వేసిన పత్తి పంట తొలి తీతలు మొదలయ్యాయి. పల్నాడులో వారం రోజులుగా పత్తితీతలు జరుగుతున్నాయి. పత్తి క్వింటాకు ప్రభుత్వం మద్దతు ధర రూ.6025గా ప్రకటించింది. తొలితీతలో నాణ్యమైన పత్తికి బహిరంగ మార్కెట్‌లో అంతకుమించి ధర లభిస్తోంది. గత రెండేళ్లుగా పత్తికి గులాబీ పురుగు ఆశించడంతో ఈ ఏడాది విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. సాధారణ విస్తీర్ణం 1.80లక్షల హెక్టార్లు కాగా 95వేల హెక్టార్లు మాత్రమే సాగులోకి వచ్చింది. పత్తికి ప్రత్యామ్నాయంగా మిర్చి, అపరాల పంటలు సాగు చేశారు. అయితే ముందస్తుగా సాగు చేసిన పంట ఏపుగా పెరిగి దిగబడులు మొదలయ్యాయి. తొలి తీత 3 క్వింటాళ్లు వస్తుండగా కొందరు రెండో తీత కూడా తీస్తున్నారు. రెండో తీతలో 4 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తున్నాయి. చీడపీడలు లేకుండా పంట కూడా బాగుండటంతో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ముందస్తు పత్తి సాగు చేసిన వారికి సగటున ఎకరాకు 10క్వింటాళ్లకు తగ్గదని రైతులు చెబుతున్నారు. దిగుబడులు బాగుండటంతోపాటు ధరలు కూడా మద్దతుకు మించి ఉన్నందున ఆశించిన సొమ్ము చేతికందుతోంది. పత్తి తీసిన వెంటనే నిల్వ చేయకుండానే రైతులు వెంటనే గ్రామాల్లోనే విక్రయిస్తున్నారు. పత్తి పంట విక్రయించగా వచ్చిన సొమ్ముతో మిర్చి సాగుకు పెట్టుబడులు పెడుతున్నారు. మాచర్ల ఏడీఏ జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ పత్తి పంట ఆశాజనకంగా ఉందని, సస్యరక్షణ చేపట్టి పంటను కాపాడుకుంటే దిగుబడులు పెరిగి గిట్టుబాటయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 
మధ్యవర్తుల మాయాజాలం: జిల్లాలో ముందస్తుగా పత్తి సాగు చేసిన రైతులకు వస్తున్న దిగుబడులను గ్రామాల్లోని మధ్యవర్తులు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. క్వింటా పత్తి నాణ్యత తక్కువగా ఉందని చెబుతూ రూ.6వేల నుంచి రూ.6500 మధ్య కొనుగోలు చేస్తున్నారు. వీరంతా రైతులకు ఎరువులు, విత్తనాలు, పెట్టుబడులకు సొమ్ము ఇచ్చి రైతుల నుంచి  పత్తి కొనుగోలు చేస్తుంటారు. ఆదోని పత్తి మార్కెట్‌లో క్వింటా పత్తి గరిష్ఠ ధర రూ.7851 కాగా మధ్యస్థంగా ఉన్న పత్తికి రూ.7251 లభించింది. పత్తి విత్తనాలు కూడా క్వింటా రూ.3900 వరకు ధర పలుకుతున్నాయి. స్పిన్నింగ్‌ పరిశ్రమ నుంచి పత్తికి డిమాండ్‌ ఉండటంతో ధరలు బాగున్నాయి. అయితే మధ్యవర్తులు గ్రామాల్లో రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. పంట బాగుండటంతో నాణ్యమైన దిగుబడులు వస్తున్నా సాకులు చూపి రైతులను మభ్యపెట్టి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. క్వింటాకు రూ.6500 ధర రావడంతో రైతులు కూడా వెంటనే అమ్ముకోవడానికి మొగ్గుచూపుతున్నారు. దీనికితోడు నిల్వ చేసుకోవడానికి కొందరికి వసతి లేకపోవడం, పెట్టుబడులకు సొమ్ము అవసరం కావడం తదితర కారణాలతో ఎక్కువ మంది విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు గ్రామాలకే వెళ్లి కొనుగోలు చేసి తెచ్చుకుని నిల్వ చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిణామాలు, దారం ఎగుమతులు ఆశాజనకంగా ఉండటం, పత్తి విత్తనాల ధర కూడా ఎక్కువగా ఉండటంతో పత్తి ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పత్తి మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలు కొన్నాళ్లు కొనసాగే అవకాశముందని వ్యాపార వర్గాల అంచనా.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని