కిలో బంగారం చోరీ కేసు మళ్లీ దర్యాప్తు చేయండి
eenadu telugu news
Updated : 16/09/2021 13:15 IST

కిలో బంగారం చోరీ కేసు మళ్లీ దర్యాప్తు చేయండి

‘డయల్‌ యువర్‌ ఎస్పీ’లో విశాల్‌గున్నీ ఆదేశం


ఫిర్యాదులు స్వీకరించి వివరాలు నమోదు చేసుకుంటున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : అచ్చంపేటకు చెందిన ఓ బంగారు నగల వ్యాపారి తన దుకాణంలో 2014లో దొంగలుపడి కిలో బంగారు ఆభరణాలు, అర కిలో వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని బుధవారం ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమంలో రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకోవాలని పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నానని ఈక్రమంలో 2018లో తన కేసును మూసివేసినట్లు తెలిపారని వాపోయాడు. స్పందించిన ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడారు. అంతపెద్ద మొత్తంలో చోరీ జరిగితే ఆ కేసులో దొంగను పట్టుకొని సొత్తును ఎందుకు రికవరీ చేయలేదని ప్రశ్నించారు. గత అధికారులు కేసు మూసివేశారని ప్రస్తుత సీఐ తెలపడంతో ఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఆ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలన్నారు. కార్యక్రమానికి పలు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. వాటి వివరాలు..

● చిలకలూరిపేటకు చెందిన యువకుడు 2019లో ఫైనాన్స్‌ కంపెనీ ద్వారా ఓ మొబైల్‌ కొన్నట్లు తెలిపాడు. రుణం డబ్బులు వసూలు చేయడానికి వచ్చిన వ్యక్తి తమపై దాడిచేశాడన్నాడు. తనపై, తన తల్లిపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాడని వాపోయాడు. ఆ కేసు వెనక్కి తీసుకోవాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని వాపోయాడు. ఎస్పీ స్పందిస్తూ అలా డబ్బులు చెల్లించవద్దన్నారు. ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడుతూ తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్‌ ఫైనాన్స్‌, డబ్బులు చెల్లింపులు కోర్టు ద్వారా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అధికారులందరూ ఎక్కడైనా ఫైనాన్స్‌ కంపెనీవాళ్లు ఖాతాదారులపై దౌర్జన్యాలకు దిగితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

●కర్లపాలెంకు చెందిన ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి జులైలో తనపై హత్యాయత్నం చేశాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిని అరెస్టు చేయలేదన్నాడు. దాడి ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

●చిలకలూరిపేటకు చెందిన వ్యక్తి ఫోన్‌ చేసి తన నాన్నను ష్యూరిటీగా సంతకాలు పెట్టించుకొని 2002లో తమ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రుణం తీసుకొని కట్టకపోవడంతో మా నాన్న ఆ నగదు చెల్లించారన్నారు. లోన్‌ తీసుకున్న వ్యక్తి తమకు డబ్బులు ఇవ్వకుండా సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నాడని వాపోయారు. ఎస్పీ స్పందిస్తూ వెంటనే మోసగాడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.

●గురజాలకు చెందిన ఓ గృహిణి ఫోన్‌ చేసి తన భర్త తాగివచ్చి చిత్రహింసలు పెడుతున్నాడని వాపోయింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.

●దాచేపల్లికి చెందిన ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తన గొంతు గుర్తు పట్టకుండా మాట్లాడాడు. తమ ప్రాంతంలో చౌకబియ్యం అక్రమ రవాణా జరుగుతోందని, తాను ఎవరనేది తెలిస్తే దుండగులు తనపై దాడిచేస్తారని వాపోయాడు. ఎస్పీ స్పందిస్తూ ఫోన్‌ చేసిన వ్యక్తిని భయపడవద్దని, అతని వివరాలు బయటకు చెప్పమన్నారు. చౌకబియ్యం అక్రమ రవాణా వివరాలను పోలీసు హెల్ప్‌లైన్‌ వాట్సప్‌ నంబర్‌కు పంపిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ సమీప పోలీసులతో మాట్లాడి తనిఖీ చేసి రేషన్‌ మాఫియాపై చర్యలు తీసుకోవాలన్నారు.

●చిలకలూరిపేటకు చెందిన మహిళ మాట్లాడుతూ 33 ఏళ్ల కిందట తాము ఇల్లు కట్టుకున్నామని, ఇప్పుడు బంధువులు వచ్చి ఆస్తి తమదంటూ దాడిచేశారని వాపోయారు. ఈవిషయమై ఎస్పీ సమీప సీఐతో మాట్లాడితే ఇరు వర్గాలు ఫిర్యాదులు చేసుకున్నారని తెలపడంతో రెండు వర్గాలపై కేసులు నమోదు చేసి బైండోవర్‌ చేయాలని ఎస్పీ ఆదేశించారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలన్నారు. ఆస్తుల విషయం కోర్టులో చూసుకోవాలని ఫిర్యాదుదారుకు తెలిపారు.

●చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి చెందిన ఓ మహిళ ఫోన్‌ చేసి తాను స్నానం చేస్తుంటే ఐదుగురు వ్యక్తులు తన చీరలాగారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. ఈవిషయమై సీఐతో ఎస్పీ మాట్లాడారు. వినాయకచవితి సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన వివాదంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఫిర్యాదు చేశారని సీఐ తెలిపారు. ఎస్పీ స్పందిస్తూ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి విచారించి చర్యలు తీసుకోవాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని