పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకుసన్నద్ధం
eenadu telugu news
Published : 18/09/2021 05:00 IST

పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకుసన్నద్ధం

వీసీలోసమీక్షించిన సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌

 ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నం

 
మాట్లాడుతున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే : జిల్లాలో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఈనెల 19న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనరు గిరిజాశంకర్‌లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఓట్ల లెక్కింపును సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టరు వివేక్‌ యాదవ్‌, గ్రామీణ జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ, జిల్లా సంయుక్త కలెక్టర్లు, జిల్లా అధికారులు వీసీకి హాజరయ్యారు. కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని, ఓట్ల లెక్కింపు వచ్చే అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు కూడా విధిగా కరోనా రెండు డోసులు వేయించుకుని నెగెటివ్‌ రిపోర్టును సమర్పించాలని స్పష్టం చేశారు. అనంతరం సీఎస్‌ కలెక్టరు వివేక్‌ యాదవ్‌, జిల్లా అధికారులతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు. కౌంటింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో 144వ సెక్షన్‌ని విధించడంతో పాటు జనసంచారం లేకుండా చూడాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. పోలీస్‌ శాఖకు సంబంధించి ఇద్దరు ఎస్పీలు వారి పరిధిలో శాంతి భద్రతల సమస్యలు ఎదురవకుండా చర్యలు తీసుకోనున్నారు.

14 కేంద్రాల్లో : జిల్లాలో 14 కేంద్రాల్లో 47 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీని కోసం సమన్వయకర్తలను నియమించారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్‌కు సంయుక్త కలెక్టర్‌ని ప్రత్యేక అధికారులుగా నియమించారు. పోలైన ఓట్లను అనుసరించి కౌంటింగ్‌ కేంద్రాల్లో టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా వీడియో కెమెరాలతో ఓట్ల లెక్కింపును రికార్డు చేయనున్నారు. 24 గంటలు విద్యుత్తు ఉండేలా జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని కలెక్టరు ఆదేశించారు. భౌతిక దూరం పాటించేలా టేబుళ్లను ఎడంగా ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 2,400 మంది సిబ్బందిని నియమించారు. వీరికి శనివారం మాస్టర్‌ ట్రైనర్లతో శిక్షణ ఇచ్చిన తర్వాత కౌంటింగ్‌ విధులకు పంపుతారు. జిల్లాపరిషత్తు సీఈవో చైతన్య, డీపీవో కేశవరెడ్డి పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఎంపీడీవోలతో ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు.

ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలి

గుంటూరు: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మొత్తం 14 కేంద్రాలను గతంలోనే గుర్తించామని, వాటిలోనే యథాతథంగా కౌంటింగ్‌ జరుగుతుందన్నారు. కొవిడ్‌ నిబందనలు పాటించే వారికే లెక్కింపు కేంద్రాల్లోకి అధికారులు, అభ్యర్థులు, సిబ్బందిని లోనికి అనుమతించాలన్నారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికారులందరికీ సెలవులను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురజాల ఆర్డీవో కొవిడ్‌తో హోం క్వారంటైన్‌లో ఉన్నందున మరో అధికారిని నియమించాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. జేసీ జి.రాజకుమారి మాట్లాడుతూ ఎన్నికల అధికారులకు అవసరమైన ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సామగ్రి సత్వరం సమకూర్చుకోవాలన్నారు. సమావేశంలో జేసీ కె.శ్రీధర్‌రెడ్డి, జడ్పీ సీఈవో చైతన్య, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌, పంచాయతీ అధికారి కేశవరెడ్డి పాల్గొన్నారు.

రాజకీయ నాయకులతో సమావేశం: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై రాజకీయ పార్టీల నాయకులతో జేసీలు జి.రాజకుమారి, కె.శ్రీధర్‌రెడ్డిలు శుక్రవారం సమావేశామయ్యారు. లెక్కింపు కేంద్రంలోకి తక్కువ మందిని అనుమతిస్తున్నామని జేసీ జి.రాజకుమారి తెలిపారు. లెక్కింపు విధానాన్ని పార్టీల నాయకులకు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని