370 పాఠశాలల్లో భయం భయం
eenadu telugu news
Updated : 18/09/2021 12:41 IST

370 పాఠశాలల్లో భయం భయం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లాలో పాఠశాల భవనం కూలి చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో గుంటూరు జిల్లావ్యాప్తంగా కూలిపోయే దశలో ఉన్న బడుల వివరాలను సమగ్ర శిక్ష అధికారులు సేకరించారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో కలిపి 3,560 పాఠశాలలు ఉండగా వాటిలో 370 బడులు శిథిల స్థితిలో ఉన్నట్లు ప్రధానోపాధ్యాయుల నుంచి సమాచారం అందింది. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు పూర్తిగా పాడైపోయి వాటిని కూల్చాల్సిన పరిస్థితి చాలా చోట్ల ఉంది. నాలుగైదు గదులు ఉండాల్సిన చోట రెండు గదులు నిర్మించి బోధన సాగిస్తున్న బడి ఆవరణలో శిథిల భవనాలు ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల కూలే దశలో ఉన్న భవనాల్లోనే బోధన సాగుతోంది. మండల పరిషత్‌ పరిధిలో 295, జడ్పీ 37, మున్సిపల్‌, మోడల్‌ స్కూల్స్‌ ఇతర పాఠశాలలు 38 కూల్చాల్సిన జాబితాలో ఉన్నాయి. పిడుగురాళ్ల మండలంలో 18, బొల్లాపల్లిలో 17, వెల్దుర్తిలో 16, సత్తెనపల్లిలో 13, అమరావతిలో 13, అమృతలూరులో 11, నిజాంపట్నంలో 13, ప్రత్తిపాడు మండలంలో 11 పాఠశాలల్లో శిథిల భవనాలు ఉన్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్‌, ఏఈ బడి భవనాల పరిస్థితిపై ఇచ్చే నివేదిక ఆధారంగా తక్షణమే వాటిని కూల్చాలని మార్గదర్శకాలు అందాయి. నాడు-నేడు ఫేజ్‌-2 కింద 280 భవనాలు నిర్మించాలని యోచిస్తున్నారు.కొత్తగా బడి భవనాల నిర్మాణానికి కావాల్సిన మేరకు స్థలం ఉంటేనే ఈ ప్రతిపాదన ముందుకెళ్లే అవకాశం ఉందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని