తెలంగాణ మద్యం భారీగా స్వాధీనం
eenadu telugu news
Published : 18/09/2021 05:00 IST

తెలంగాణ మద్యం భారీగా స్వాధీనం

సూత్రధారి కళాశాల అధ్యాపకుడు


స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు పరిశీలిస్తున్న సెబ్‌ జేడీ బిందుమాధవ్‌, ఈఎస్‌ అన్నపూర్ణ తదితరులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : కళాశాలలో విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకుడు మద్యం అక్రమ రవాణాకు పాల్పడ్డాడు. డిగ్రీ చదివిన ఇద్దరు యువకులతో కలిసి అతను నడుపుతున్న అక్రమ మద్యం రవాణా గుట్టును గుంటూరు సెబ్‌ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో నిందితుల వివరాలను స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (సెబ్‌) జాయింట్‌ డైరెక్టర్‌ బిందుమాధవ్‌ తెలిపారు. మేడా సంపత్‌ గుంటూరులోని ఓ ప్రముఖ కళాశాలలో అధ్యాపకుడు. అతని స్నేహితులైన డిగ్రీ చదువుకున్న వినుకొండకు చెందిన నర్రా అశోక్‌, ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన చెన్నారెడ్డి వెంకటరమణలతో కలిసి హైదరాబాద్‌ సమీపంలోని మేడ్చల్‌ పరిసరాల్లో వైన్‌ షాపుల్లో మద్యం సీసాలు కొనుగోలు చేశారు. ఆటోలు, కారుల్లో గుంటూరుకు అక్రమ రవాణా చేశారు. గత ఏడాదిన్నరగా నాలుగు, ఐదు బాక్సుల చొప్పున తీసుకొచ్చి గుజ్జనగుండ్లలోని నర్రా అశోక్‌కు చెందిన అద్దె ఇంట్లో నిల్వ చేశారు. కొద్ది నెలలుగా రహస్యంగా సీసాలు విక్రయిస్తున్నారు. సెబ్‌ జేడీ ఆధ్వర్యంలోని ప్రత్యేక టీమ్‌ సీఐ నారాయణస్వామి సేకరించిన సమాచారం మేరకు శుక్రవారం ఈఎస్‌ అన్నపూర్ణ నేతృత్వంలో ఏఈఎస్‌ మణికంఠ, సెబ్‌ గుంటూరు 2 సీఐ కర్ణ, సిబ్బంది తనిఖీలు చేశారు. నర్రా అశోక్‌, చెన్నారెడ్డి వెంకటరమణలను అరెస్టు చేసి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రూ.17.20 లక్షల విలువైన 1428 తెలంగాణ మద్యం సీసాలు జప్తు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు సంపత్‌ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. భారీగా మద్యం పట్టుకున్న సీఐలు నారాయణస్వామి, కర్ణలతోపాటు సిబ్బంది పోతురాజు, రవీంద్రారెడ్డి, నాగరాజు, రాధాకృష్ణ, శ్రీకాంత్‌, ఏసోబు, రాజేష్‌, కల్యాణ్‌చక్రవర్తి, ప్రేమ్‌కుమార్‌, పూర్ణచంద్రరావు, ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డిలను జేడీ బిందుమాధవ్‌ అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని