ద్రుష్టి  పెడితేనే  మేలు 
eenadu telugu news
Updated : 18/09/2021 06:24 IST

ద్రుష్టి  పెడితేనే  మేలు 

కొరవడిన ‘కంటివెలుగు’ శస్త్ర చికిత్సలు


ఏరియా ఆసుపత్రిలోని కంటి విభాగం

న్యూస్‌టుడే, నరసరావుపేట పట్టణం : లాక్‌డౌన్‌ సమయంలో జిల్లాలో కంటి వైద్యం అందక ఇలాంటి వారు ఎంతోమంది ఇబ్బందులకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ‘వైఎస్సార్‌ కంటివెలుగు’ పూర్తిస్థాయిలో అమలు కావటం లేదు. పథకంలో భాగంగా జిల్లాలోని ప్రజలందరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఆపరేషన్లతో పాటు కళ్లజోళ్లు ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి, రెండు దశల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేశారు. మూడో దశలో 60ఏళ్లు పైబడిన వారికి పరీక్షలు చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలో వైఎస్సార్‌ కంటివెలుగు పథకం మూడోదశ పక్రియ కొనసాగుతోంది. ఈ దశలో ఇప్పటికి లక్షకు పైగా పరీక్షలు చేశామని ఇంకా రెండు లక్షల మందికి చేయాల్సి ఉందని అధికారులే చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ నేపథ్యంలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ మసకబారింది. పథకంలో గుంటూరు, తెనాలి, నరసరావుపేట, బాపట్లలోని ప్రభుత్వ వైద్యశాలలతో పాటు ప్రైవేటు ఆసుపత్రులైన శంకర్‌, కాటూరి తదితర వైద్యశాలల్లో ఆపరేషన్లు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. పథకం అమల్లో ఉన్నప్పటికి ఏడాదిన్నరగా కంటి వైద్యం పూర్తిస్థాయిలో పేదలకు అందటం లేదు. ప్రభుత్వ వైద్యశాలల్లో సకాలంలో ఆపరేషన్లు జరగకపోవటంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కంటివైద్యం పేదలకు భారంగా మారింది. రెండు కళ్లకు శుక్లాలు తీయించుకోవాలంటే కనీసం రూ.30 వేలు చెల్లించాల్సి వచ్చింది. ఒకవైపు కరోనాతో పనులు లేక ఇబ్బంది పడుతుంటే మరోవైపు ప్రభుత్వ వైద్యశాలలో కంటివైద్యం అందక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్‌ కంటి వెలుగు పథకంలో భాగంగా జిల్లాలో మొదటి, రెండు దశల్లో 6,29,751 మంది విద్యార్థులకు పరీక్షలు చేశారు. వీరిలో 18,084 మందికి కళ్లజోళ్లు అవసరమై ఇవ్వగా ఇంకా ఏడువేల మందికి ఇవ్వాల్సి ఉంది.

ఈపూరు మండలానికి చెందిన వృద్ధుడు రెండు నెలల క్రితం కంటి చూపు తగ్గటంతో నరసరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చాడు. పరీక్షలు చేసిన డాక్టర్‌ ఆపరేషన్‌ అవసరం అని చెప్పారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్లాల శస్త్ర చికిత్సలు చేయటం లేదని చెప్పారు. దీంతో వృద్ధుడు వైద్యం కోసం ప్రైవేటు వైద్యశాలకు వెళ్లాడు. అక్కడ వైద్యం చేయించుకునే స్థోమత లేకపోవటంతో అప్పు చేయాల్సి వచ్చింది. ఒక కంటికి ఆపరేషన్‌ చేయించుకుంటే సుమారు రూ.15 వేలు ఖర్చు అయింది.

నరసరావుపేట మండల పరిధి ములకలూరుకు చెందిన పేద మహిళ కంటి సమస్యతో గత జూన్‌లో ప్రభుత్వ వైద్యశాలకు వచ్చింది. పరీక్షలు చేసిన సిబ్బంది ఆమె రెండు కళ్లకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని చెప్పారు. అయితే ప్రభుత్వ వైద్యశాలలో ఇప్పుడు శస్త్ర చికిత్సలు చేయటం లేదని బయట చేయించుకోమని సిబ్బంది సూచించారు. గుంటూరు రోడ్డులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆమె ఆపరేషన్‌ చేయించుకుంది. సదరు మహిళకు రూ.20వేలు ఖర్చు అయింది. ఆకుకూరల వ్యాపారం చేసి దాచుకున్న సొమ్మంతా కంటి శస్త్ర చికిత్సకు వెచ్చించింది. రెండు నెలలు ఎటూ వెళ్లవద్దని వైద్యులు చెప్పటంతో ఆమె కుటుంబ పోషణ కోసం అప్పు చేయాల్సి వచ్చింది.

అందరికీ నేత్ర వైద్య సేవలు

కంటి వైద్యసేవలు ప్రజలందరికి సకాలంలో అందేలా తగిన చర్యలు తీసుకుంటాం. కొవిడ్‌ నిబంధనలతో వైఎస్సార్‌ ‘కంటి వెలుగు’ పథకం అమల్లో జాప్యం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా మూడోదశ కొనసాగుతుందని 4, 5 దశల్లో ప్రజలందరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తాం, కళ్లజోళ్లు అందిస్తాం. -హనుమంతరావు, వైద్య విధాన పరిషత్తు జిల్లా సమన్వయకర్త

జిల్లాలో జనాభా : 48,87,813

కుటుంబాలు : 13.5 లక్షలు

ఇప్పటి వరకు కంటి పరీక్షలు చేసింది : 1,01,843మందికి

శుక్లాల ఆపరేషన్లు అవసరమైన వారు : 13,891

ఇప్పటివరకు చేసిన శస్త్రచికిత్సలు : 5,321

ఇంకా చేయాల్సిన వారు : 8,570

కళ్లజోళ్లు అవసరమైన వారి సంఖ్య : 46,985

ఇప్పటి వరకు ఇచ్చినవి : 24,819

ఇంకా ఇవ్వాల్సినవి : 22,166


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని