రహదారి ప్రమాదంలో అన్న మృతి.. చెల్లికి తీవ్రగాయాలు
eenadu telugu news
Published : 18/09/2021 05:00 IST

రహదారి ప్రమాదంలో అన్న మృతి.. చెల్లికి తీవ్రగాయాలు


తీవ్రంగా గాయపడిన మౌనికకు ప్రాథమిక చికిత్స అందిస్తున్న 108 సిబ్బంది

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : కళ్ల ముందే అన్న ప్రాణం అనంత వాయువుల్లో కలసి పోవడంతో ఆ సోదరి విలవిలలాడింది. ప్రమాదంలో తన తలకు తీవ్రగాయాలై రక్తం కారుతున్నా అన్నయ్య మృతి ఆమెను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ హృదయ విదారకర సంఘటన చిలకలూరిపేట పట్టణం ఏఎంజీ సమీపంలోని పెట్రోలు బంకు ఎదురుగా 16వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. చిలకలూరిపేట పట్టణంలోని గాంధీపేట రెండో లైనుకు చెందిన బత్తిని మౌనిక ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె పరీక్ష రాసేందుకు ఆమె సోదరుడు కుమారస్వామి (17) పరీక్ష కేంద్రం వద్దకు ద్విచక్ర వాహనంపై చెల్లిని తీసుకుని వస్తున్నాడు. ఏఎంజీ పరీక్ష కేంద్రం సమీపంలో పెట్రోలు బంకు ఎదురుగా వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఒంగోలు వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో కుమారస్వామి అక్కడికక్కడే దుర్మరణం చెందగా మౌనికకు తీవ్రగాయాలయ్యాయి. తన కాలు విరిగి నడుముకు దెబ్బ తగిలింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెళ్లి మౌనికకు ప్రాథమిక చికిత్స చేసి స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కుమారస్వామి టీ స్టాల్‌ నడుపుతూ కుటుంబానికి అండగా ఉండేవాడు. తల్లిదండ్రులు సాంబశివరావు, సునీత, సోదరి మౌనికను జాగ్రత్తగా చూసుకునేవాడు. కుమారుని మృతితో ఇక మాకు దిక్కెవరంటూ తల్లిదండ్రులు రోదిస్తుండటం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. అర్బన్‌ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై మోహన్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కుమారుని మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని