విద్యార్థుల ఉన్నతే లక్ష్యం
eenadu telugu news
Published : 18/09/2021 05:00 IST

విద్యార్థుల ఉన్నతే లక్ష్యం

ఉపాధ్యాయిని జీవీ హేమలత కృషి

పలు అవార్డులు ఆమె సొంతం


2018లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినిగా అప్పటి సీఎం చంద్రబాబునాయుడు నుంచి

అవార్డు అందుకుంటున్న ఉపాధ్యాయిని జీవీ హేమలత

యడ్లపాడు, న్యూస్‌టుడే : 2002 అక్టోబరు 17న ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన యడ్లపాడు మండలం మైదవోలు ఎంపీపీ పాఠశాలల ఉపాధ్యాయిని జీవీ హేమలత తన ప్రజ్ఞా పాటవాలతో విద్యార్థులను తీర్చిదిద్దారు. వారికి కళలపై ఆసక్తి కల్పించారు. ముఖ్యంగా బాలికలను పలు అంశాల్లో ఉన్నతీకరణ చేశారు. గ్రామీణ ప్రాంత బాలికలు చదువుకు దూరమవుతుండటం గమనించి భేటీ బచావో, భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రతిరోజు వారికి కుట్లు, అల్లికలు, పెయింటింగ్‌, పేపర్‌ క్రాఫ్ట్‌ ఇలా రకరకాల ఆభరణాలు తయారు చేయించటం నేర్పించారు. మానసిక వికలాంగులైన పిల్లలకు కూడా సహనంతో వాటిపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారు తయారు చేసిన వస్తువులను మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రదర్శనలు ఇప్పించారు. స్వచ్ఛభారత్‌, స్వచ్ఛతే సేవ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులతో పలు రచనలు చేయించి, పాడించి వాటిని వివిధ మాస, పక్ష, వారపత్రికలకు పంపేలా చేశారు. 2014 నుంచి 2018 వరకు విద్యార్థులను ఉన్నతీకరణ చేసి ఏడాదికి రెండు, మూడు సార్లు ఆల్‌ ఇండియా రేడియాలో వచ్చే బాలానందం కార్యక్రమానికి విద్యార్థులను తీసుకు వెళ్లారు. రంగోత్సవ్‌ సంస్థ నిర్వహించే జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరచి గోల్డ్‌మెడల్‌ కూడా సాధించారు. పిల్లలకు పాడిన పాటలను సీడీ రూపొందించి అప్పటి కలెక్టర్‌ ద్వారా ఆవిష్కరించారు. విద్యార్థుల పాటలను జాగృతి పేరిట పుస్తకం రూపొందించి అప్పటి కమిషనర్‌ ద్వారా ఆవిష్కరించారు.

విభిన్న అంశాల్లో తర్ఫీదు

పర్యావరణ హితమైన మట్టి వినాయకుని విగ్రహాలు చేయించటం, నో బ్యాగ్‌ డే రోజున ప్లాస్టిక్‌ రహితమైన జూట్‌ బ్యాగులు, కాగితాలతో వివిధ ఆభరణాలు, దారపు గాజులు తయారు చేయటంపై హేమలత విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. పర్యావరణ దినోత్సవం రోజున అడవులు, తండాల్లో ఉండే బాలికలపై నాటకీకరణ, కథానికలు రాసి విద్యార్థులతో ప్రదర్శనలు చేయించారు. మొక్కలు పంపిణీ చేశారు. పసిడి పలుకుల పేరుతో పాఠశాల స్థాయిలో విద్యార్థులు రాసిన కథలు, వంటకం, తెలిసిన కళలతో సొంత మేగజైన్‌ తయారు చేయించారు. 2016లో హేమలత భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. 2017లో యడ్లపాడు ప్రాథమిక పాఠశాలలో (ఎంపీపీ) ఝాన్సీ లక్ష్మీభాయ్‌ స్కౌట్‌ యూనిట్‌ తయారు చేసింది. బాలికా విద్యకు సంబంధించి ఎన్నో అంశాలు బోధించారు. తాను హిందీ భాషా ప్రవీణ పూర్తి చేసి పిల్లలను కూడా హిందీ ప్రాథమిక, మాధ్యమ, రాష్ట్ర పరీక్షలు రాయించారు. 2018లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినిగా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కరోనా కాలంలో 2020, 2021లో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ద్వారా ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాల నిర్వహించినందుకు పాఠశాల విద్యా కమిషనర్‌ చినవీరభద్రుడు ద్వారా ప్రశంసాపత్రం పొందారు.

విజ్ఞానం పెంచుకుంటూ.. ఇతరులకు పంచుతూ

గ్రామీణ నరసరావుపేట, న్యూస్‌టుడే : ప్రభుత్వ ఉపాధ్యాయిని ఉద్యోగ సాధనతో ఆమె తృప్తి పడలేదు. నిత్య విద్యార్థిని వలె విజ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. నరసరావుపేటకు చెందిన ఉపాధ్యాయిని బీబీటీ సుందరి సీసీఆర్టీ జిల్లా రిసోర్స్‌ పర్సన్‌గా పని చేశారు. ఉపాధ్యాయినిగా బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు రాష్ట్ర రిసోర్స్‌ పర్సన్‌గా పని చేస్తున్నారు. 12 సార్లు జాతీయ శిబిరాలకు వెళ్లి వచ్చారు. ఇప్పటి వరకూ గుంటూరు జిల్లాలో 500 మంది ఉపాధ్యాయులకు సీసీఆర్టీలో శిక్షణ ఇచ్చారు. వంద మందిని రాష్ట్ర స్థాయి, 50 మందిని జాతీయ స్థాయి శిక్షణకు పంపించారు. శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి కాగితాలతో వివిధ కళాకృతులు, మాస్కులు, ఫింగర్‌ పప్పెట్స్‌, గ్లోవ్‌ తయారీపై శిక్షణ ఇచ్చారు. ఇటీవల సిక్కింలో మూడు రోజుల పాటు స్వఛ్ఛభారత్‌పై నిర్వహించిన సెమినార్‌కు ఆంధ్రప్రదేశ్‌ తరఫున వెళ్లి వచ్చారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని వివిధ ఆన్‌లైన్‌ కోర్సులు చేయడం, అంతర్జాల కాన్ఫరెన్స్‌ల్లో రాణిస్తే సర్టిఫికెట్లు, ప్రశంసా పత్రాలు కలిపి 200 వరకూ అందుకున్నారు. యూనిసెఫ్‌ వారి అత్యవసర పరిస్థితుల్లో పోషణ, నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతల పరిచయం, పిల్లల రక్షణ, సామాజిక సేవా, శ్రామికశక్తి బలోపేతం వంటి కోర్సులు పూర్తి చేశారు.

అవార్డులు సొంతం

సీసీఆర్టీ శిక్షణకు గుర్తింపుగా గతంలో భారతీయ ప్రతిష్ట సంస్థ వారు రాష్ట్రీయ శిక్షక్‌ భూషణ్‌ పురస్కారాన్ని అందజేశారు. ఇటీవల జాతీయ స్థాయిలో పర్యావరణం, మానవ ఆరోగ్యం, స్థిరమైన అభివృద్ధి అనే అంశాలపై నిర్వహించిన ఆన్‌లైన్‌ కాన్ఫరెన్స్‌లో రాణించారు. వాతావరణ కాలుష్యం, మానవులపై ప్రభావం నివారణ మార్గాలకు సంబంధించి చిత్రాలను గీసి ఈఎస్‌డీఏకు ఆన్‌లైన్‌లో పంపించి విజేతగా నిలిచారు. జాతీయ విద్యా విధానంపై నిర్వహించిన క్విజ్‌ పోటీలో గెలుపొందారు. జ్ఞాపికలను అందుకున్నారు.

జ్ఞాపికలతో బీబీటీ సుందరి

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని