డీజీపీ కార్యాలయానికి వెళ్లినతెదేపా నాయకులపై కేసులు
eenadu telugu news
Published : 20/09/2021 02:37 IST

డీజీపీ కార్యాలయానికి వెళ్లినతెదేపా నాయకులపై కేసులు

ఈనాడు, అమరావతి : ఈ నెల 17న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇంటిపైకి దూసుకొచ్చిన వైకాపాకు చెందిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఫిర్యాదు చేయడానికి డీజీపీ కార్యాలయానికి వెళ్లిన తెదేపాకు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తాడేపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి, డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఒక్కసారిగా రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోకి అనుమతి లేకుండా చొచ్చుకొచ్చి తన విధులకు ఆటంకం కలిగించారని ఏఎస్సై బుస్సా మధుసూదనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు పెట్టారు. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, అమరనాథరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్‌, డోలా బాలవీరాంజనేయులు, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, బోడె ప్రసాద్‌, తెనాలి శ్రావణ్‌కుమార్‌, జీవీ ఆంజనేయులు, నాయకులు నసీర్‌ అహ్మద్‌, అబ్బూరి మల్లి, అంబటి విజయలక్ష్మి, రవి అనే 17 మందితో పాటు మరికొందరు ఇతరులపై 143, 341, 188, 269, 270 రెడ్‌విత్‌ 149 ఐపీసీల కింద కేసులు నమోదయ్యాయి. ‘నేను పోలీసు ప్రధాన కార్యాలయంలో ముందు గేటు వద్ద విధుల్లో ఉండగా డీజీపీని కలవటానికి వెళ్లాలని తెదేపా నాయకులు దూసుకొచ్చారు. ఎవరైనా ఒకరు లోపలికి వచ్చి ఉన్నతాధికారుల అనుమతి పొందాలని సూచించాను. మాకేం అనుమతి అవసరం లేదని ప్రధాన గేటులో నుంచి లోపలికి ప్రవేశించి నా విధులకు ఆటంకం కలిగించారని’ ఏఎస్సై మధుసూదనరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘తనిఖీల పేరుతో ఇంజినీర్లను ఇబ్బంది పెట్టొద్దు’

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: విధులు సమర్థంగా నిర్వహించడంతోపాటు అభివృద్ధి పనులను వేగవంతంగా జరిగేలా పర్యవేక్షిస్తున్న ఇంజినీర్లను తరచూ వివిధ తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టడం తగదని పంచాయతీరాజ్‌ డిప్లొమా ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.రవీంద్ర అన్నారు. నగరంలోని ఓ కాన్ఫరెన్స్‌హాల్లో పంచాయతీరాజ్‌ డిప్లొమా ఇంజినీర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ఉపాధిహామీ, ఎస్‌డీఎఫ్‌ నిధులతో జరిగిన పనులపై క్వాలిటీ కంట్రోల్‌, థర్డ్‌ పార్టీ తనిఖీలు చేసినా మళ్లీ విజిలెన్స్‌ ఏసీబీ ద్వారా నిర్వహించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సాహంగా పనిచేసే ఇంజినీర్లకు నిరాశ కలుగుతుందన్నారు. తనిఖీలను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.రామరాజు, గౌరవాధ్యక్షుడు ఎస్‌కే రియాజ్‌ అహ్మద్‌, పూర్వ అధ్యక్షుడు హనుమంతరావు, సలహాదారు పి.సుభాష్‌బాబు, ఫైనాన్స్‌ కార్యదర్శి కేశవులు, సత్యనారాయణ, రత్నప్రసాద్‌ 13 జిల్లాల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని