అధికార పక్షానిదే ఆధిపత్యం
eenadu telugu news
Published : 20/09/2021 02:59 IST

అధికార పక్షానిదే ఆధిపత్యం

గణపవరం సీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు

ఈనాడు, గుంటూరు - న్యూస్‌టుడే, జిల్లాపరిషత్తు : జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో జిల్లాలో అధికార పార్టీ వైకాపా జయకేతనం ఎగురవేసింది. ఫలితాలు ఏకపక్షంగా రావడంతో సింహభాగం స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దుగ్గిరాల మండలం మినహా అన్ని మండలాల్లో వైకాపాకు మెజారిటీ స్థానాలు రావడంతో ఆ పార్టీ అభ్యర్థులకే ఎంపీపీ, ఇతర పదవులు దక్కనున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా ఎన్నికలను బహిష్కరించడంతో మెజారిటీ స్థానాల్లో ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ పార్టీల తరఫున అభ్యర్థులు పోటీ చేసినా ఒక్క స్థానవ΄ దక్కకపోవడం గమనార్హం. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్‌లోనూ వైకాపా అభ్యర్థులు ఆధిక్యం కనబరిచారు. 

సత్తాచాటని పలు పార్టీలు

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలై ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత బహిష్కరణ నిర్ణయం తీసుకుంది. ఆయా స్థానాలకు తెదేపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడంతోపాటు దాడులకు తెగబడి ఏకగ్రీవం చేసుకున్నందుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించింది. అప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావడంతో తెదేపా అభ్యర్థులు సైతం సాంకేతికంగా పోటీలో ఉన్నట్లయింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొందరు తెదేపా అభ్యర్థులు పార్టీ నిర్ణయాన్ని కాదని ముందుకెళ్లారు. మెజారిటీ అభ్యర్థులు మాత్రం పార్టీ నిర్ణయానుసారం పోటీకి దూరంగా ఉండిపోయారు. తెదేపా అభ్యర్థులు పోటీచేసిన కొన్నిచోట్ల అధికార పార్టీ అభ్యర్థులను ఓడించి విజయం సాధించారు. అయితే జిల్లావ్యాప్తంగా ఒక్క దుగ్గిరాల మండలం మినహా ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆ పార్టీకి స్థానాలు రాలేదు. జనసేన, భాజపా కలిసి పోటీ చేసినా ఫలితాలు సాధించలేకపోయాయి. వామపక్షాలు ఒక్క ఎంపీటీసీ స్థానంతో సరిపెట్టుకున్నాయి. దీంతో అధికారపార్టీ అభ్యర్థులకు దీటైన పోటీ లేకపోవడంతో వారి విజయం నల్లేరు మీద నడకలా మారింది. తెదేపా అభ్యర్థులు సాంకేతికంగా పోటీలో ఉండటంతో ప్రతిచోట ఆయా అభ్యర్థులకు కొన్ని ఓట్లు లభించాయి. స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎంపీటీసీ స్థానాలకు కొన్నిచోట్ల నేతలు దీటుగా పోటీ ఇవ్వడంతో విజయాన్ని సాధించారు. తక్కువ సమయం ఉన్నాగాని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఓట్ల లెక్కింపు పూర్తిచేసినందుకు జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికార యంత్రాంగాన్ని, ఎస్పీలు ఆరిఫ్‌ హఫీజ్, విశాల్‌ గున్నీలను అభినందించారు.

తల్లీకూతుళ్ల విజయదరహాసం

కోడె సుధారాణి, పెడవల్లి పార్వతి

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: పరిషత్తు ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసిన తల్లీకూతుళ్లు విజయం సాధించారు. చిలకలూరిపేట మండలంలోని లింగంగుంట్ల గ్రామానికి చెందిన పెడవల్లి పార్వతి ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసి 920 మెజార్టీతో గెలిచారు. ఇదే మండలం జడ్పీటీసీ అభ్యర్థినిగా పోటీకి దిగిన పార్వతి కుమార్తె కోడె సుధారాణి 12,980 ఓట్లతో విజయం సాధించారు. గెలుపు అనంతరం లెక్కింపు కేంద్రం బయట వారిద్దరూ ఆనందం వ్యక్తం చేస్తూ కనిపించారు.

తడిసిన ఓట్లతో  తంటా

తెనాలి వీఎస్‌ఆర్‌ కళాశాలలో భద్రపరిచిన బ్యాలెట్‌ పెట్టెల్లోకి నీళ్లు చేరాయి. ప్రధానంగా కొల్లూరు మండలంలోని కొల్లూరు, అనంతవరం, చినపులివర్రు, చిలువ΄రు, ఈపూరు, ఈపూరులంక, క్రాప గ్రామాలకు చెందిన ఓట్లు తడవడంతో అధికారులు లెక్కించడానికి అవస్థలు పడ్డారు. ఓట్ల పత్రాలను పంకాల కింద ఆరబెట్టారు. ఓటర్లు వేసిన ముద్ర కొన్నింటిపై చెరిగిపోవడంతో వాటిని చెల్లని ఓట్లుగా పరిగణించారు. - కొల్లూరు, న్యూస్‌టుడే

జడ్పీలో ప్రతిపక్షం లేకుండా..

జిల్లాలో 57 జడ్పీటీసీ స్థానాలు ఉండగా తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఉండటంతో వాటికి ఎన్నికలు నిర్వహించలేదు. శావల్యాపురం జడ్పీటీసీ తెదేపా అభ్యర్థి పోలింగ్‌కు ముందు మరణించడంతో అక్కడ ఎన్నిక ఆగిపోయింది. 8 స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 45 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అన్ని స్థానాల్లో వైకాపా అభ్యర్థులే విజయదుందుభి మోగించారు. మొత్తం 53 మంది వైకాపా అభ్యర్థులు ఎన్నికయ్యారు. రాజకీయ చైతన్యం కలిగిన గుంటూరు జిల్లాలో ప్రతిపక్షం తరఫున సభ్యుడు లేకుండా జడ్పీ కొలువుదీరడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ప్రత్తిపాడు: బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్న వైకాపా నేతలు 

క్రిస్టినాకే ఛైర్మన్‌ పీఠం? 

ఈనాడు, అమరావతి : జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో ఆ సామాజికవర్గాల నుంచి గెలిచిన అభ్యర్థులు జడ్పీ పీఠం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కొల్లిపర నుంచి జడ్పీటీసీ సభ్యురాలిగా పోటీ చేసి గెలుపొందిన కత్తెర హెన్రీ క్రిస్టినా ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రచారం పొందారు. ఆమె 2014 ఎన్నికల్లో తాడికొండ అసెంబ్లీ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల ముందు వరకు తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆమె స్థానంలో ఉండవల్లి శ్రీదేవికి సీటు ఇవ్వడంతో అవకాశం కోల్పోయారు. దీంతో పార్టీ నుంచి తొలి నుంచి పని చేసినందున క్రిస్టినాను తొలుత డీసీఎంఎస్‌ ఛైర్‌పర్సన్‌గా నామినేటేడ్‌ పదవిని ఇచ్చింది. అనంతరం పరిషత్‌ ఎన్నికలు రావడంతో ఛైర్‌పర్సన్‌గా అవకాశం ఇస్తామని చెప్పి వైకాపాకు గట్టి పట్టున్న కొల్లిపర నుంచి పోటీ చేయించారు. అక్కడి నుంచి ఆమె 17,616 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దాదాపు ఆమె పేరు ఖరారయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈమె జడ్పీ కిరీటాన్ని అందుకుంటే కొల్లిపర నుంచి జడ్పీ ఛైర్మన్‌గా పదవి పొందిన ద్వితీయ మహిళగా గుర్తింపు పొందుతారు. ఇక్కడి నుంచి 2006లో జడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందిన కూచిపూడి విజయ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అయితే ఇద్దరూ స్థానికేతరులు కావడం గమనార్హం. అయితే క్రిస్టినా సంతానం విషయం, ఎస్సీ సామాజిక ధ్రువీకరణ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ జరిగింది. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఇద్దరికి మించి సంతానం ఉన్నట్లయితే పోటీకి వారు అనర్హులు. క్రిస్టినా దంపతులకు నలుగురు సంతానం ఉన్నారని ఫిర్యాదు చేయడంతో విచారణ జరుగుతోంది. ఈ అంశాన్ని పార్టీలోని ఒక వర్గం ప్రస్తావించి తమకు అవకాశం కల్పించాల్సిందిగా కోరుతోంది. విచారణ కొనసాగుతున్నందున నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో మరో వర్గం వారు తమకు జడ్పీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించాలని పార్టీ నేతలను అంతర్గతంగా కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్ష పదవికి ఎవరికి దక్కనుందన్న అంశమై ఆసక్తి నెలకొంది. ఛైర్‌పర్సన్‌ పదవి మహిళ కావడంతో తప్పనిసరిగా పురుషులకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. ఉపాధ్యక్ష పదవికి రిజర్వేషన్‌ లేకపోవడంతో వివిధ సామాజిక వర్గాలకు చెందిన పలువురు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేలను కలిసి పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని