జర్మనీలో అగ్నిప్రమాదం
eenadu telugu news
Published : 21/09/2021 01:37 IST

జర్మనీలో అగ్నిప్రమాదం

ప్రవాసాంధ్రుడు మృతి.. భార్యకు తీవ్రగాయాలు


భాస్కర్, పుష్ప (పాత చిత్రం)

బాపట్ల, న్యూస్‌టుడే : జర్మనీ దేశం హాంబర్గ్‌లోని బహుళ అంతస్తుల భవనంలో ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో బాపట్లకు చెందిన ప్రవాసాంధ్రుడు తాళ్లూరి భాస్కర్‌ మృతి చెందగా ఆయన భార్య పుష్ప తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు హాంబర్గ్‌ నుంచి దంపతుల స్నేహితులు బాపట్ల గ్రామీణ ఎస్సై వెంకటప్రసాద్‌కు ఫోన్‌ చేసి సమాచారం తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భాస్కర్‌ మృతిచెందినట్లు సోమవారం రాత్రి 11 గంటలకు బంధువులకు సమాచారం వచ్చింది. భాస్కర్‌ తండ్రి శివయ్య, తల్లి పార్వతి బాపట్లలో నివాసం ఉంటున్నారు. ప్రమాదంలో భాస్కర్, పుష్ప తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని బంధువు శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. యూకేలో ఉంటున్న భాస్కర్‌ సోదరుడు గణేష్‌కు సమాచారం తెలియగానే హాంబర్గ్‌కు బయలుదేరినట్లు పేర్కొన్నారు. దంపతులు ఆరేళ్ల క్రితం జర్మనీ వెళ్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు.
వినాయక ఉత్సవాలకు చందా పంపారు...
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: మా బావ భాస్కర్‌ తాళ్లూరి ఏటా గుంటూరులో జరిగే వినాయక చవితి ఉత్సవాలకు చందా పంపుతుంటారు. ఈ ఏడాది కూడా రూ.10,000 పంపారు. ఆ కుటుంబాన్ని  వినాయకుడే రక్షిస్తాడని భాస్కర్‌ బావమరిది ఉదయగిరి బాలరవి దేవరాజ్‌ పేర్కొన్నారు. భాస్కర్‌ సోదరి శ్రీదేవి గుంటూరు శ్యామలనగర్‌లో నివాసం ఉంటున్న బాలరవి దేవరాజ్‌ భార్య. అగ్ని ప్రమాదం భాస్కర్‌ ఉంటున్న భవనంలో కింద ప్రాంతంలో జరిగిందని, ఇది తెలుసుకుని రెండో అంతస్తులో ఉంటున్న భాస్కర్, పుష్ప అక్కడ నుంచి దూకారని చెబుతున్నారు. శనివారం రాత్రి పుష్పతో ఫోన్‌లో మా అత్తగారు పార్వతి మాట్లాడారు. ఆ సమయంలో రెస్టారెంట్లో ఉన్నామని చెప్పారు. ఇంతలో ఇలా జరిగింది... అని బాలరవి దేవరాజ్‌ వాపోయారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని