తెలంగాణ మద్యం భారీగా పట్టివేత
eenadu telugu news
Published : 21/09/2021 01:37 IST

తెలంగాణ మద్యం భారీగా పట్టివేత


స్వాధీనం చేసుకున్న మద్యం, నిందితులతో సెబ్‌ అధికారులు

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: తెలంగాణ నుంచి మద్యం భారీగా తీసుకొచ్చారని, సమాచారం అందడంతో ఎస్‌ఈబీ అధికారులు దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట ఎక్సైజ్‌ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్‌ఈబీ ఈఎస్‌ చంద్రశేఖరరెడ్డి వివరాలు వెల్లడించారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడిషనల్‌ సూపరింటెండెంట్‌ బిందుమాదవ్‌ ఆదేశాల మేరకు సెబ్, డీటీఎఫ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో పల్నాడు ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు. కోటప్పకొండ సమీపంలోని గ్రామానికి తెలంగాణా మద్యం వస్తుందన్న సమాచారంతో కొండకావూరు సమీపంలో జరిగిన తనిఖీల్లో మినీ లారీలో తెలంగాణ మద్యం నిల్వలు ఉండటాన్ని గుర్తించామని తెలిపారు. నరసరావుపేట, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు నిందితులు అంగీకరించడంతో ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.4 లక్షల మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మినీలారీ, ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేశామని వీటి విలువ రూ.7 లక్షలు ఉంటుందని తెలిపారు. చిలకలూరిపేటకు చెందిన పాలపర్తి శివకోటేశ్వరరావు, బాణావత్‌ దుర్గానాయక్, షేక్‌ సుబాని, నాదెండ్ల మండలం కనపర్రుకు చెందిన దేవరకొండ వెంకటసుబ్బయ్య, 75 తాళ్లూరుకు చెందిన కుంబా యల్లమందయ్య, ప్రకాశం జిల్లా జె.పంగులూరుకు చెందిన బుచ్చిరాజు హరికృష్ణ ముఠాగా ఏర్పడి తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అక్రమంగా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్న మరికొందరు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. ఆరుగురిపై కేసు నమోదు చేశామని ఈఎస్‌ తెలిపారు. దాడుల్లో ఎస్సై సురేంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని