నోటా 12,053
eenadu telugu news
Published : 21/09/2021 01:37 IST

నోటా 12,053

గుంటూరు, న్యూస్‌టుడే: జిల్లాలో జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ నచ్చకుంటే ‘నోటా’కు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పరిషత్‌ ఎన్నికల ఓట్లను ఆదివారం లెక్కించారు. 45 జడ్పీటీసీ స్థానాలకు వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 188 మంది పోటీ చేశారు. ఆయా జడ్పీటీసీ స్థానాల్లో అభ్యర్థులు తమకు నచ్చకపోవడంతో బ్యాలెట్‌ పత్రంలో చివరలో ఉన్న ‘నోటా’కు ఓటు వేశారు. కొల్లిపర జడ్పీటీసీ స్థానంలో అత్యధికంగా 746 ఓట్లు నోటాకు వచ్చాయి. కొల్లూరు జడ్పీటీసీ స్థానంలో 675 ఓట్లు, బాపట్లలో 638, అమరావతిలో 537, భట్టిప్రోలులో 520, నగరంలో 502, తెనాలిలో 489, చేబ్రోలులో 461, చెరుకుపల్లిలో 436, వినుకొండలో 410, రేపల్లెలో 386, నరసరావుపేటలో 370, కాకుమానులో 350, చిలకలూరిపేటలో 337, పిట్టలవానిపాలెంలో 328, అమృతలూరు, తాడికొండ, పెదకాకానిలో 321, కర్లపాలెంలో 316, దుగ్గిరాల, మేడికొండూరుల్లో 306, అచ్చంపేటలో 279, వేమూరులో 273, పొన్నూరులో 271, చుండూరులో 255, రొంపిచర్లలో 245, బొల్లాపల్లిలో 244, క్రోసూరులో 228, నకరికల్లులో 226, వట్టిచెరుకూరు, పెదనందిపాడు జడ్పీటీసీ స్థానాల్లో 206, ఈపూరులో 184, పెదకూరపాడులో 170, దాచేపల్లిలో 160, ప్రత్తిపాడులో 150, ముప్పాళ్లలో 129 ఓట్లు నోటాకు వేశారు. ఇతర మండలాల్లోనూ వంద లోపు నోటాకు ఓట్లు వచ్చాయి. ఫిరంగిపురం, సత్తెనపల్లి, రాజుపాలెం, యడ్లపాడు, మాచవరం మండలాల్లో నోటాకు ఒక్క ఓటూ వేయలేదు. జిల్లాలో నోటాకు మొత్తం 12,053 మంది ఓటు వేసి తమ నిరసనను తెలిపారు. ఎంపీటీసీ స్థానాల్లోనూ నోటాకు ఓట్లు వచ్చాయి. 

నేడు జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఎన్నికకు ప్రకటన
గుంటూరు, న్యూస్‌టుడే: జిల్లాపరిషత్‌ ఛైర్‌పర్సన్‌తో పాటు వైస్‌ ఛైర్మన్, ఇద్దరు కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల కోసం జిల్లా ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ మంగళవారం ప్రకటన విడుదల చేయనున్నారు. 25న ప్రత్యేక సమావేశం నిర్వహించి జడ్పీటీసీ సభ్యులుగా గెలుపొందిన వారు ఛైర్‌పర్సన్, ఇద్దరు వైస్‌ ఛైర్మన్‌లను తమలో నుంచి ఎన్నుకుంటారు. కో-ఆప్షన్‌ రెండు స్థానాలకూ సభ్యులను ఎన్నుకుంటారు. ఆ రోజు వీలు కాకపోతే 26న ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రతిపక్ష తెదేపా, ఇతర పార్టీలు కనీస సీట్లను కూడా సాధించకపోవడంతో పరిషత్‌ పాలకవర్గాల్లో వైకాపాకు చెందిన వారు కొలువు దీరనున్నారు. ఇప్పటికే రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీవోలు మండలాల్లో ఎంపీపీల ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలిపి ఈనెల 24న ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని కోరుతున్నారు. జడ్పీ అధికారులు కూడా జడ్పీటీసీ స్థానాల సభ్యులుగా విజయం సాధించిన వారికి ఫోన్లు చేసి 25న సమావేశానికి రావాలని సమాచారం ఇచ్చారు. 

 ఎంపీపీల ఎన్నికకు ఏర్పాట్లు
గుంటూరు, న్యూస్‌టుడే: జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ఆదివారం రాత్రి వరకు కొనసాగింది. అత్యధిక ఎంపీటీసీ స్థానాలతో పాటు ఎన్నికలు జరిగిన 45 జడ్పీటీసీ స్థానాలను వైకాపా గెలుచుకుంది. 8 జడ్పీటీసీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. పోలింగ్‌కు ముందు ఓ అభ్యర్థి మరణించడంతో శావల్యాపురం జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. 54 మండల పరిషత్‌ అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు, కో-ఆప్షన్‌ సభ్యుడి ఎన్నికకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు వివేక్‌ యాదవ్‌ సోమవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లాపరిషత్తు సీఈవో ప్రకటనకు సంబంధించి దస్త్రాన్ని తయారుచేసి తీసుకెళ్లగా కలెక్టరు సంతకం చేసి ఆమోదించారు. ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొందిన వారు తమ నుంచి ఎంపీపీతో పాటు ఉపాధ్యక్షుడు, కో-ఆప్షన్‌ సభ్యుడిని ఈనెల 24న ప్రత్యేక సమావేశంలో ఎన్నుకుంటారు. ఆ రోజు ఏవైనా కారణాలతో ఎన్నికలు నిర్వహించకపోతే 25న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని