స్పందనకు సమస్యల వెల్లువ
eenadu telugu news
Published : 21/09/2021 01:37 IST

స్పందనకు సమస్యల వెల్లువ


ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న జేసీ దినేష్‌కుమార్‌ 

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నూరుశాతం పరిష్కరించాలని జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జేసీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ అర్జీలను నిర్దేశించిన సమయంలోనే పరిష్కరించాలని సూచించారు. సోమవారం 244 అర్జీలు స్పందన కార్యక్రమంలో వచ్చినట్లు తెలిపారు. అనంతరం జేసీలు జి.రాజకుమారి, అనుపమ అంజలి, కె.శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో పి.కొండయ్య, ప్రత్యేక కలెక్టర్‌ వినాయకం ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. 

వితంతు పింఛను కోసం ఎదురుచూపు 
దుర్గి మండలం రాజానగరంనకు చెందిన కె.లక్ష్మీభాయి భర్త 2008లో మరణించారు. ఆ తర్వాత పింఛను కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. కొత్తగా వాలంటీర్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నా పింఛను దక్కలేదన్నారు. నిత్యం కూలి పని చేసుకుంటున్న తనకు కుటుంబ పోషణ భారంగా ఉంటుందని, ఎన్ని కార్యాలయాల చుట్టూ తిరిగినా పింఛను మాత్రం దక్కడం లేదని గోడును వెలిబుచ్చారు. ఇప్పుడు స్పందనలో అధికారులకు విన్నవించుకునేందుకు వచ్చినట్లు ఆమె తెలిపారు. 

పోరంబోకు స్థలం ఆక్రమించి ఇంటి నిర్మాణం
పాఠశాల భవనాన్ని ఆనుకుని ఉన్న పోరంబోకు స్థలాన్ని అక్రమించి అనధికారికంగా ఇళ్లు నిర్మించుకున్నారని, ఆ స్థలంలో ఆక్రమణలు తొలగించాలని నాదెండ్ల మండలం గణపవరం గ్రామస్థుడు ఎ.సాంబశివరావు అధికారులకు వినతిపత్రం అందించారు. డివిజనల్‌ రెవెన్యూ అధికారి ఆక్రమణలు నిలుపుదల చేయాలని గతంలోనే ఉత్తర్వులిచ్చినా.. 2018 వరకు అధికారులు గోప్యంగా ఉంచారని, ఆర్టీఐ ద్వారా సమాచారం కోరగా  ఆ ఉత్తర్వులను బయటపెట్టారన్నారు. కొందరు అధికారులు ఆక్రమణదారులకు అండగా ఉండటంతో వారు నిర్మాణాలు చేపట్టారన్నారు. అధికారులు  ఇప్పటికైన స్పందించి ఆక్రమణదారుల నుంచి ఆ స్థలాన్ని కాపాడాలని కోరుతున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని